చెన్నూరు ఎస్‌‌బీఐ దగ్గర  గోల్డ్‌‌ లోన్‌‌ బాధితుల ఆందోళన...

చెన్నూరు ఎస్‌‌బీఐ దగ్గర  గోల్డ్‌‌ లోన్‌‌ బాధితుల ఆందోళన...

చెన్నూరు, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌‌బీఐలో చోరీ అయిన బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేసినప్పటికీ.. బ్యాంకర్లు తమకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ బాధితులు శుక్రవారం బ్యాంక్‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం 10 గంటలకు బ్యాంక్‌‌ వద్దకు వచ్చిన బాధితులు బ్యాంక్‌‌ మేనేజర్‌‌ను కలిశారు. మధ్యాహ్నం 3 గంటలు అయినా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో.. ఆగ్రహానికి గురైన బాధితులు బ్యాంక్‌‌ ఎదుట బైఠాయించారు. 

అనంతరం పలువురు మాట్లాడుతూ... బంగారం చోరీ అయిన నాటి నుంచి ఇప్పటివరకు వడ్డీ మాఫీ చేస్తే లోన్‌‌ను పూర్తిగా చెల్లిస్తామని, తమ బంగారం తమకు ఇవ్వాలని అడిగితే సమాధానం చెప్పడం లేదన్నారు. గోల్డ్‌‌ కోసం ఎనిమిది నెలలుగా బ్యాంక్‌‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌‌ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న సీఐ బన్సీలాల్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం బ్యాంక్‌‌ మేనేజర్‌‌ రాజేశతో మాట్లాడగా... వడ్డీ మాఫీ తమ పరిధిలో లేదని స్పష్టం చేశారు. చివరకు పోలీసులు బాధితులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.