భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో లా కాలేజీ ఏర్పాటు చేయాలని గోండ్వాన సంక్షేమ పరిషత్ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ సోందే వీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలోఐటీడీఏ ఎదుట రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ తెలంగాణలో మైదాన ప్రాంతాల్లో ప్రైవేట్ లా కాలేజీలకు అనుమతులు ఇస్తుందని, కానీ ఆదివాసీ షెడ్యూల్డ్ ఏరియాలో మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు.
గిరిజన నిరుద్యోగ యువకులకు లా చదివే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 109 జీవో, ఎక్సైజ్‌శాఖలో 124 జీవోను అమలు చేసి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, నాయకులు సున్నం సుబ్బయ్య, పాయం సన్యాసి, కారం సాయమ్మ, కారం సుధ, కారం లక్ష్మి, సున్నం సమ్మక్క, పొడియం రామక్క, సోడె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
