ఐపీఎల్ -2022 సీజన్ తొలి మ్యాచ్లో విజయం సాధించి జోరు మీదున్న పంజాబ్ కింగ్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్కు దూరమైన పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్, ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జానీ బెయిర్ స్టో జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంజాబ్ కింగ్స్ ప్రకటించింది. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ కారణంగా తొలి మ్యాచ్ కు బెయిర్ స్టో దూరమయ్యాడు. టెస్టు సిరీస్ అనంతరం భారత్కు చేరుకున్న అతడు మూడు రోజులు క్వారంటైన్లో ఉండనున్నాడు. దీంతో శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరగనున్న పంజాబ్ కింగ్స్ తదుపరి మ్యాచ్కు బెయిర్ స్టో దూరం కానున్నాడు. పంజాబ్ కింగ్స్ ఆడబోయే మూడో మ్యాచ్కు అతడు అందుబాటులో ఉంటాడు. 2022 ఐపీఎల్ -మెగా వేలంలో భాగంగా జానీ బెయిర్ స్టోను రూ.6కోట్ల 75లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత మూడు సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్కు బెయిర్ స్టో ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు 28 మ్యాచ్లు ఆడిన బెయిర్ స్టో 1,038 పరుగులు చేశాడు.
మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులకు కూడా ఓ శుభవార్త. ఆస్ట్రేలియా విధ్వసంకర ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ త్వరలోనే భారత్ రానున్నాడు. క్వారంటైన్ పూర్తి చేసుకుని ఆర్సీబీతో కలవనున్నాడు ఈ కొత్త పెళ్లికొడుకు. ఈ నెల 18న భారత సంతతికి చెందిన వినీ రామన్ ను మాక్సీ పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ ఉండటంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు మాక్సీ దూరమయ్యాడు. ఇక మారేజ్ సెలెబ్రేషన్స్ ముగిసిన అనంతరం, మాక్సీ భారత్కు వచ్చేందుకు రెడీ అయ్యాడు. దీనికి సంబంధించి, సోషల్ మీడియాలో తన పాస్ పోర్టు, విమాన టిక్కెట్ల ఫొటోలను మాక్స్ వెల్ షేర్ చేశాడు. సతీమణి వినీతో కలిసి ఇండియాకు వస్తున్నట్లు హింట్ ఇచ్చాడు ఈ ‘తమిళ అల్లుడు’. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాక్సీ రాకతో ఆర్సీబీ మరింత బలం పుంజుకోనుంది. ఇక ఐపీఎల్ -2022 సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లో పరాజయం పాలైన డుప్లెసిస్ బృందం.. బుధవారం నాటి మ్యాచ్ లో కోల్ కతాపై విజయం సాధించి బోణీ కొట్టింది. ఏప్రిల్ 5న రాజస్తాన్ రాయల్స్ తో తమ తదుపరి మ్యాచ్ లో ఆర్సీబీ తలపడనుంది.

