V6 News

గూగుల్, ఫేస్‌బుక్‌లకు ఆస్ట్రేలియా షాక్.. జర్నలిజం బతికించేందుకు కొత్త పన్ను వసూళ్లు..

గూగుల్, ఫేస్‌బుక్‌లకు ఆస్ట్రేలియా షాక్.. జర్నలిజం బతికించేందుకు కొత్త పన్ను వసూళ్లు..

ఆస్ట్రేలియా ప్రభుత్వం టెక్ దిగ్గజాలకు ఊహించని షాక్ ఇచ్చింది. గూగుల్, మెటాకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు.. జర్నలిస్టులు కష్టపడి రాసిన వార్తలను వాడుకుంటూ లాభాలు గడించడంపై ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సర్కార్ సీరియస్ అయింది. వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించకపోతే భారీగా పన్ను కట్టాల్సిందేనంటూ కొత్త చట్టాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

డబ్బులు ఇస్తారా? టాక్స్ కడతారా?
ఆస్ట్రేలియా ప్రతిపాదించిన ఈ కొత్త న్యూస్ బార్గెయినింగ్ ఇన్సెంటివ్ ప్రకారం.. మీడియా సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోని ప్లాట్‌ఫారమ్‌లపై వారి ఆస్ట్రేలియా ఆదాయంలో 2.25 శాతం పన్ను విధిస్తారు. ఒకవేళ ఆయా సంస్థలు జర్నలిజానికి తగిన డబ్బు చెల్లిస్తే.. వారికి పన్ను రాయితీలు లభిస్తాయి. ఈ చట్టం ద్వారా ఏటా సుమారు 200 నుంచి 250 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

జర్నలిజం అంటే ప్రజాస్వామ్యానికి ప్రాణం:
పెద్ద అంతర్జాతీయ సంస్థలు న్యూస్ కంటెంట్‌ను ఉచితంగా తీసేసుకుని లాభాలు గడించడం సరికాదని ప్రధాని ఆల్బనీస్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం హెల్తీగా ఉండాలంటే జర్నలిజంలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని అన్నారు. ఈ చట్టం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా వార్తా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టుల సంఖ్య ఆధారంగా పంపిణీ చేయాలని కమ్యూనికేషన్ మంత్రి అనికా వెల్స్ నిర్ణయించారు.

టెక్ దిగ్గజాల తిరుగుబాటు:
గూగుల్, మెటా మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది కేవలం డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అని, వార్తా సంస్థలే తమ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లాభపడుతున్నాయని మెటా వాదిస్తోంది. గూగుల్ సైతం ఈ పన్ను అవసరం లేదని తేల్చి చెప్పింది. ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను వదిలేసి కేవలం తమనే టార్గెట్ చేయడం ఏంటని గూగుల్ ప్రశ్నించింది.

అమెరికా ఒత్తిడి ఉన్నా తగ్గేదేలే:
ఈ చట్టం ప్రధానంగా అమెరికా కంపెనీలనే టార్గెట్ చేస్తోందని అక్కడి నుంచి విమర్శలు వస్తున్నా ఆస్ట్రేలియా ప్రధాని వెనక్కి తగ్గడం లేదు. తాము ఒక సార్వభౌమ దేశం.. తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటాం అని ఆస్ట్రేలియా ప్రధాని ధీటుగా బదులిచ్చారు. జూలై 2 నాటికి ఈ ప్రతిపాదన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు, మీడియా సంస్థల మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఆస్ట్రేలియా నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.