గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్..

గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
  • వర్క్ ఫ్రమ్ హోం చేసే ఒక్కొక్కరికీ రూ.75 వేలు
  • జులై 6 నుంచి ఆఫీసులు ఓపెన్
  • సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటన

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా లాక్​డౌన్ ఎఫెక్టుతో ఇంటినుంచే పనిచేసే గూగుల్ సిబ్బంది ఒక్కొక్కరికి 1,000 యూఎస్ డాలర్లు(రూ.75000) ఇస్తున్నట్లు చెప్పింది. లాక్ డౌన్ సడలింపుల మేరకు జులై 6 నుంచి నగరాల్లో తమ ఆఫీసులను తిరిగి ఓపెన్ చేయనున్నట్లు ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు కరోనా ఎఫెక్టుతో ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వారికి కావాల్సిన ఫర్నిచర్, పరికరాలు, ఖర్చుల కోసం ఒక్కో ఉద్యోగికి వెయ్యి డాలర్లు అదనంగా ఇస్తున్నామని చెప్పారు. ఆఫీసులకు వచ్చే సిబ్బంది పరిమిత సంఖ్యలో షిఫ్టుల వారీగా పనిచేస్తారని తెలిపారు. తొలుత ఆఫీసులకు రావాల్సిన అవసరం ఉన్న 10 శాతం సిబ్బంది హాజరవుతారని, పరిస్థితులు అనుకూలిస్తే సెప్టెంబర్ నాటికి 30 శాతం ఉద్యోగుల హాజరు ఉంటుందని పిచాయ్ అన్నారు. మిగతా ఉద్యోగులందరికీ ఈ ఏడాది చివరిదాకా వర్క్ ఫ్రం హోం ఉంటుందన్నారు.