గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘భరతవర్ష’. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
అనుదీప్ దేవ్ కంపోజ్ చేసిన పాటకు చంద్రబోస్ ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. దీపక్ బ్లూ, లక్ష్మి మేఘన కలిసి పాడారు. ‘ఓ వీర.. జయధీర.. ధృవతార..’ అంటూ మొదలైన సాంగ్ గోపీచంద్ క్యారెక్టరైజేషన్‌ను ప్రజెంట్ చేస్తోంది.
‘పయనించే శిఖరం నువ్వేరా.. ప్రవహించే సమరం నువ్వేరా.. ఈ పుడమికి కావాలి నువ్వురా, ఆ కడలికి కంచెవు నువ్వురా.. గగనానికి గొడుగైనావురా.. అయినా నువ్వు ఒంటరి.. ఒక్కడై సాగినా లక్ష్యమే నువ్వురా.. ఆ లక్ష్యమే వీడని దీక్షవే నువ్వురా..’ అంటూ సాగిన పాటలో గోపీచంద్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు.
హిమాలయాల నేపథ్యంలో పాటను చిత్రీకరించడంతో విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రీ.శ. 642 నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
