- ప్రభుత్వానికి చెప్పుకున్నాఉపయోగం లేదు
- బ్రాహ్మణ పరిషత్ ఉద్యోగులకుఇంకా జీతాలు రాలేదని ఆవేదన
బషీర్ బాగ్,- వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి అన్నారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఇది వాస్తవమని పేర్కొన్నారు. గత ఆరేండ్లుగా తాను బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నానని, ఈ నెల ఇప్పటి వరకు తమ పరిషత్ ఉద్యోగులకు జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన అసమర్థత అవుతుందని ప్రభుత్వానికి చెప్పుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఓ హోటల్ లో జరిగిన తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తమకు మూడు , నాలుగు నెలలుగా పెన్షన్ లు రావడం లేదని తెలిపారు. కొత్తవారికి కూడా పెన్షన్లు ఇవ్వడం లేదని రమణాచారికి తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. అక్టోబర్ నెలలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని, ఆ లోపే ప్రభుత్వానికి మీ డిమాండ్లు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలని రమణాచారి వారికి సూచించారు. ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు గద్దర్ , గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ సాయి చంద్ చిత్రపటాలకు పులమాలలు వేసి నివాళులర్పించారు.

