భద్రాద్రికొత్తగూడెం/ టేకులపల్లి, వెలుగు : జిల్లాలో జరగనున్న నీట్ ఎగ్జామ్ను పక్కాగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరగనున్నదని, జిల్లాలో 1,078 మంది ఎగ్జామ్ రాయనున్నారన్నారు.
కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ కాలేజీ, లక్ష్మీదేవిపల్లి శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజీ, పాల్వంచ నవభారత్ ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ ఎదురుగా ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బయోమెట్రిక్, రిజిస్ట్రేషన్, భద్రతా తనిఖీల దృష్ట్యా అభ్యర్థులు ముందుగానే సెంటర్ల వద్దకు చేరుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డు పై తప్పని సరిగా పాస్పోర్టు సైజ్ ఫొటో ఉండాలన్నారు. అదనంగా మరో ఫొటోతో పాటు తాజా ఫొటో ఉన్న గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు.
ఎగ్జామ్సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ సీఐ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా టేకులపల్లి ఎంపీడీవో ఆఫీస్లో నిర్వహించిన పిల్లల భద్రత వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బాల్య వివాహం– బతుకు ఆగం వాల్పోస్టర్ ఆవిష్కరించారు. మండల పరిధిలోని బొమ్మనపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, వివరాలు ఆరా తీశారు.

