- సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలి : జమ్మూకశ్మీర్లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా
ఖమ్మం టౌన్, వెలుగు : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో స్థిరపడాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్మనోజ్ సిన్హా సూచించారు. చదువు ప్రాముఖ్యతను గుర్తించి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. బుధవారం ఖమ్మం నగరంలో పర్యటించిన ఆయన వెలుగుమట్లలోని కాన్రాయ్ స్కూల్ ను సందర్శించారు. ఆయనకు ఖమ్మం కలెక్టర్ దివాకర, స్కూల్ చైర్మన్ నామ తరుణ్ బొకేలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఏకశిలా గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. స్కూల్ లో ఏర్పాటు చేసిన ఎఫ్ఎం పాడ్ కాస్ట్ స్టూడియోను గవర్నర్ ప్రారంభించారు.
విద్యార్థి నాయకత్వ బాధ్యతల ప్రదానోత్సవం సందర్భంగా స్టూడెంట్లకు బ్యాడ్జీలు అందజేసి మాట్లాడారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న నో బ్యాగ్ డే కార్యక్రమం అభినందనీయమని, విద్యార్థుల క్రమశిక్షణ, ప్రతిభ తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. తర్వాత ఎన్ఎస్పీ కాలనీలో నూతనంగా నిర్మించిన శివాలయానికి చేరుకుని అభిషేకం చేశారు. అక్కడి నుంచి ఖమ్మం రూరల్ మండలంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తల్లిదండ్రులు వరమ్మ, ముత్తయ్యల స్మృతివనాన్ని సందర్శించి వారి విగ్రహాలకు నివాళులర్పించారు.
అంతకు ముందు ఎన్ఎస్పీ గెస్ట్ హౌజ్ లో పోలీస్ అధికారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్ తో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు లెఫ్టినెంట్ గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అమలవుతున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల విస్తరణ, గ్రామీణ, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం గురించి తెలుసుకున్నారు.
