ఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటనూ తప్పకుండా అమలు చేస్తుందని, దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బుధవారం ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. తిరుమలాయపాలెం మండలం తిమ్మక్కపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మేడిదపల్లిలో బస్ షెల్టర్ ను ప్రారంభించిన అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని, రెండు విడతల్లో కలిపి ఇప్పటి వరకు 7 లక్షల ఇండ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రామీణ రహదారులు, విద్యాసంస్థలు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు అన్ని వసతులు కల్పించి, కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా పోటీపడే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. పేదరికం కారణంగా చదువు ఆగిపోవద్దన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విద్యను సంక్షేమ కార్యక్రమంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్ ను నిర్మించే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. కార్యక్రమంలో భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, పీఆర్ ఈఈ మహేశ్ బాబు పాల్గొన్నారు.
