- ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు నారవేప చెట్టును ఎంపిక చేసిన అర్చకులు, ధర్మకర్తలు
- ఆసిఫాబాద్ అడవుల్లో దొరికే టేకు, నారవేపతో రథం తయారీ
వరంగల్, వెలుగు : వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు స్పీడ్‌గా సాగుతున్నాయి. మొదటి దశలో రూ. 30 కోట్లతో ఆలయం చుట్టూరా మాఢవీధుల నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం ఆలయానికి మూడువైపులా ఉన్న చెరువు, లోయలో మట్టి నింపి చదును చేయగా.. మరోవైపు ఉన్న గుట్టను తొలిచేశారు. అలాగే అమ్మవారి ఆలయం ముందు 55 ఫీట్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేయడంతో పాటు మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని తయారు చేయిస్తున్నారు.
నూతన ధ్వజస్తంభానికి అవసరమైన చెట్టు కోసం ఆలయ ప్రధానార్చకులు, దేవాలయ ధర్మకర్తల బృందం మార్చి 31న భద్రాద్రి జిల్లా పాల్వంచ సమీపంలోని వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్‌లో కలియతిరిగారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత అరుదుగా దొరికే నార వేపచెట్టు కర్రను ధ్వజస్తంభం కోసం ఓకే చేశారు. ఈ చెట్టు నరికిన తర్వాత కొన్ని రోజుల పాటు ఎండ బెట్టనున్నారు.
ఆ తర్వాత దానిని వరంగల్‌కు తరలించనున్నారు. మరో వైపు బ్రహ్మోత్సవాలు, నవరాత్రుల సమయంలో అమ్మవారి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా రథాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన కలప కోసం ధర్మకర్తల కమిటీ సభ్యులు మహారాష్ట్రలోని నాగ్‌పూర్, బల్హార్షా ప్రాంతాల్లోని అడవుల్లో చెట్లు, కలపను పరిశీలించారు. చివరకు ఆసిఫాబాద్ అడవుల్లో దొరికే టేకుతో పాటు నార వేప కలపను ఎంపిక చేశారు.
ఇప్పటికే చెట్ల కోత పూర్తి కాగా.. కలపను ఒకటి రెండు రోజుల్లో ఆలయానికి తీసుకురానున్నారు. రథం తయారీలో ధృఢత్వం కోసం కిందిపైభాగంలో నార వేప కర్రను వాడుతుండగా.. మధ్యలో డిజైన్ కోసం టేకును వాడనున్నారు. రథం తయారీ కోసం తమిళనాడు నుంచి ప్రత్యేక శిల్పుల బృందం రానుంది. ఈ పనుల కోసం భద్రకాళి ఆలయం వద్ద ప్రత్యేక షెడ్‌ను నిర్మించారు.

