V6 News

కాలేజీలకు మంచి రోజులు : ఇంటర్ విద్యా జేఏసీ

 కాలేజీలకు మంచి రోజులు : ఇంటర్ విద్యా జేఏసీ
  • రూ.56 కోట్లతో కాలేజీలకు  సర్కార్ రిపేర్లు: ఇంటర్ విద్యా జేఏసీ 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాలేజీలకు మంచి రోజులొచ్చాయని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యను గాలికొదిలేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి కార్పొరేట్‌‌‌‌కు దీటుగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. గురువారం నాంపల్లిలోని జీజేఎల్‌‌‌‌ఏ ఆఫీసులో జేఏసీ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, బలరామ్ జాదవ్, లక్ష్మణ్ రావు, కవితా కిరణ్ తదితరులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం 2015–-16లో ఉచిత విద్యను ప్రారంభించిందని గొప్పలు చెప్పింది కానీ, కాలేజీల నిర్వహణకు నిధులు ఇవ్వలేదన్నారు. తొమ్మిదేండ్లలో రూ.65 లక్షలు మాత్రమే ఇచ్చారని, దీంతో కాలేజీల్లో జాతీయ పండుగలు కూడా నిర్వహించలేని దుస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

సర్కార్‌‌‌‌‌‌‌‌ కాలేజీలకు కనీసం సున్నం వేయడానికి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో 326 కాలేజీల్లో మౌలిక వసతులు, మరమ్మతుల కోసం రూ.56.16 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి నెలా ‘కాలేజీ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్’కింద రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు మంజూరు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, ప్రస్తుతం 90 వేల అడ్మిషన్లు ఉన్నాయని, వచ్చే విద్యాసంవత్సరానికి ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుతో పాటు యూనిఫామ్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అబ్బాయిలకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఇంటర్ విద్యా జేఏసీ ప్రతినిధులు ఆంజనేయులు, శ్రీనివాస్, రజిత   పాల్గొన్నారు.