11 మంది ఎస్జీటీల నియామకానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్

11 మంది ఎస్జీటీల నియామకానికి  సర్కార్ గ్రీన్ సిగ్నల్
  •     ప్రస్తుత ఖాళీల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని డీఈవోలకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ-2024 అభ్యర్థుల నియామక వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం చేస్తున్న 11 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) నియామకానికి పచ్చజెండా ఊపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేస్తూ.. తక్షణమే వారికి నియామక పత్రాలు అందజేయాలని ఆయా జిల్లాల డీఈఓలను ఆదేశించారు. 

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) ద్వారా డీఈడీ పూర్తి చేసిన 11 మంది అభ్యర్థుల నియామకంపై గతంలోనే కోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది. అయితే, అధికారులు దీన్ని అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  ఇది "లాస్ట్ ఛాన్స్" అని పేర్కొంటూ వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది.