టాడి ఫెస్టివల్ ను రద్దు చేస్తున్నం.. ప్రభుత్వం ఎల్లప్పుడూ గీత కార్మికుల పక్షమే: మంత్రి పొన్నం

టాడి ఫెస్టివల్ ను రద్దు చేస్తున్నం.. ప్రభుత్వం ఎల్లప్పుడూ గీత కార్మికుల పక్షమే: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: కల్లు అమ్మడం గీత కార్మికుల సంప్రదాయ హక్కు అని, దాన్ని ఎవరైనా హరించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఊరుకోదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కాలానికి అనుగుణంగా తాటి కల్లు వినియోగాన్ని విస్తరించి, స్టార్ హోటల్స్, కల్లు బార్​ల రూపంలో ప్రోత్సహించాలన్న ఆలోచనతోనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లతో కలిసి ఇటీవల టాడి ఫెస్టివల్ ను ప్రకటించే కార్యక్రమంలో పాల్గొన్నామని తెలిపారు. 

గౌడ కుటుంబాలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఉద్దేశంతోనే తాటి కల్లు మేళా చేపట్టాలని భావించామని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. గౌడ సంఘాల విజ్ఞప్తి మేరకు ఆదివారం జరగాల్సిన టాడి ఫెస్టివల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

 ప్రభుత్వం ఎల్లప్పుడూ గీత కార్మికుల పక్షాన నిలుస్తుందని, వారికి అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత వనాల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ప్రతి జిల్లాలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.