62 కాదు.. 31.07 ఎకరాలే.. వెలుగుమట్ల భూదాన్ భూములపై సర్కారు క్లారిటీ 

62 కాదు.. 31.07 ఎకరాలే.. వెలుగుమట్ల భూదాన్ భూములపై సర్కారు క్లారిటీ 
  •  1955 నాటి రికార్డులను బయట పెట్టిన అధికారులు 
  • కూల్చివేతల బాధితులకు ఇండ్ల స్థలాల కోసం పరిశీలన

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల లెక్క తేలింది. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం వినోబాబావేకు దాత కలవల రాజారాం ఇచ్చిన భూమి 62 ఎకరాలు కాదు, కేవలం 31.07 ఎకరాలేనని స్పష్టమైంది. ఈ మేరకు 1955, 1956 రికార్డులను ప్రభుత్వం బయటపెట్టింది.

 అప్పటి ఖాస్రా పహానీ ప్రకారం వెలుగుమట్లలో సర్వే నంబర్ 147లో 21 ఎకరాలు, 148లో 21 ఎకరాలు, 149లో 20.07 ఎకరాల భూమి ఉంది. వీటిలో మొత్తం భూమి 62.07 ఎకరాలుగా రికార్డుల్లో నమోదైంది. అయితే సర్వే నంబర్ 147లో 10.20 ఎకరాలు, 148లో 10.20 ఎకరాలు, 149 లో 10.07 ఎకరాలు వినోబాబావే పేరుతో అప్పటి రికార్డుల్లో నమోదైంది. 

మిగిలిన భూములు ఇతర ప్రైవేట్ వ్యక్తుల పేరుతో పట్టాలుగా నమోదయ్యాయి. 1953 రికార్డుల ప్రకారం కలవల రాజారాం(తండ్రి గోపాలకృష్ణయ్య) తన పేరుతో ఉన్న 31.07 ఎకరాలు మాత్రమే వినోబాబావేకు రాసిచ్చారు. ఇదే భూమి అప్పటి నుంచి వినోబాబావే భూదాన్ భూములుగా రికార్డుల్లో కంటిన్యూ అవుతోంది.

వివాదం ఎక్కడ వచ్చిందంటే..!

గత నెల 24న భూదాన్ భూముల్లో అక్రమ నివాసాలను ప్రభుత్వం కూల్చివేసింది. దాదాపు 700 ఇండ్లు నేలమట్టం కాగా, అందులో చాలా మంది మధ్య దళారుల నుంచి ప్లాట్లు కొనుక్కున్న వారిగా వెల్లడైంది. ఈ సందర్భంగా యూసీసీఆర్ఎల్(యంఎల్) ఓపీడీఆర్ కు చెందిన పలువురు మీడియాతో మాట్లాడుతూ.. తమ ఇండ్లను కూల్చివేసిన 31 ఎకరాలను మాత్రమే అధికారులు స్వాధీనం చేసుకొని, మిగిలిన 31 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా కొంతమంది పెద్దలకు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అధికారులు అప్పటి రికార్డులను బయటపెట్టారు. 

పదేళ్లుగా వివాదం..

మరోవైపు ఈ భూముల్లో ఉంటున్న ప్రైవేట్ వ్యక్తులు తమ పట్టా భూముల కోసం కోర్టులను ఆశ్రయించారు. భూదాన్ భూములుగా చెబుతూ కొందరు ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూముల్లోనూ ఇండ్లను నిర్మించడంతో, 2023 సెప్టెంబర్ లో అప్పటి అధికారులు కూల్చేశారు. దాదాపు పదేళ్లుగా భూదాన్ భూములకు, ప్రైవేట్ పట్టా భూముల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు భూదాన్ భూముల లెక్కపై ఆఫీసర్లు క్లారిటీ ఇవ్వడంతో ఇక వివాదాలకు తెరపడే అవకాశముంది.

అర్హులకు పట్టాలు..

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఇండ్లు కోల్పోయిన వారిలో అర్హుల గుర్తింపు సర్వే ఇంకా కొనసాగుతోంది. 720 మందికి పైగా బాధితుల్లో సగం మంది కంటే తక్కువగా అర్హులున్నట్టు తేలింది. వీరికి స్థలాలు ఇచ్చేందుకు భూముల పరిశీలన జరుగుతోందని, నివాస యోగ్యమైన స్థలాన్నే వారికి కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే వారంలోనే వారికి పట్టాలు ఇవ్వడంతో ఇవ్వడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తామని అంటున్నారు. ఇటీవల సమీక్ష సందర్భంగా ఈ నెల 15లోపు పట్టాలు అందజేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించగా, ఆలోగానే పని పూర్తి చేస్తామంటున్నారు. 

భూదాన్ భూములనే స్వాధీనం చేసుకున్నాం

1955 నుంచి ఉన్న పహానీ రికార్డుల ప్రకారం 31.07 ఎకరాలు మాత్రమే భూదాన్ భూములు. వీటిలో ఆక్రమణలను మాత్రమే తొలగించాం. 147, 148, 149 సర్వే నంబర్లలో ఈ భూదాన్ భూములు 31.07 ఎకరాలు కాకుండా, మిగిలిన 31 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములతో మాకు సంబంధం లేదు. వాటిని ఎవరైనా అమ్ముకోవచ్చు, ఇతరులెవరైనా కొనుక్కోవచ్చు.

– ఎన్.శ్రీనివాస్, ఆర్డీవో, ఖమ్మం-