ఇయ్యాల మధ్యాహ్నం కల్లా డ్యూటీలో చేరాలె

ఇయ్యాల మధ్యాహ్నం కల్లా డ్యూటీలో చేరాలె

 

  • ఇయ్యాల మధ్యాహ్నం కల్లా డ్యూటీలో చేరాలె
  • లేదంటే ఉద్యోగుల కింద లెక్కకట్టం
  • జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సర్కారు డెడ్‌‌‌‌లైన్
  • సెక్రటరీలను చర్చలకు పిలిచేది లేదు
  • వాళ్లు రాకుంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్లను టెంపరరీగా నియమిస్తం
  • చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్లకు, డీపీవోలకు సీఎస్ ఆదేశాలు
  • మధ్యాహ్నంకల్లా డ్యూటీలో చేరాలె

హైదరాబాద్, వెలుగు:  సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రాష్ట్ర సర్కారు డెడ్ లైన్ విధించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల కల్లా డ్యూటీలో చేరాలని ఆదేశించింది. వారిని చర్చలకు పిలిచేది లేదని తేల్చిచెప్పింది. సమ్మె విరమించి డ్యూటీలో జాయిన్ కావాలని   సూచించింది. జాయిన్ కాని వారిని డీమ్డ్ టు బి టర్మినేటెడ్ ( సస్పెండ్) గా పరిగణిస్తామని తెలిపింది. ఇందుకు చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్లు (లోకల్ బాడీస్), జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో) లను ఆదేశించింది. శుక్రవారం పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు, ఇతర అధికారులతో కలిసి సీఎస్ శాంతి కుమారి అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

శనివారం 12 గంటలలోపు జేపీఎస్​లు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని, లేకపోతే వారిని ఉద్యోగుల కింద పరిగణించదని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తున్నది. ఆ టైమ్ వరకు డ్యూటీలో జాయిన్ అయిన వారి రిపోర్టును ప్రభుత్వానికి పంపాలని సీఎస్ ఆదేశించారు. త్వరలో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి, 2018లో జేపీఎస్ పరీక్ష రాసిన వారిలో మెరిట్‌ ఉన్న వారిని, ఆ గ్రామానికి చెందిన వ్యక్తిని రిజర్వేషన్ వారీగా జేపీఎస్ గా తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. అప్పటి వరకు గ్రామంలో డిగ్రీ చదివిన వారిని తాత్కాలికంగా జేపీఎస్ లుగా నియమించుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ గ్రామంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారు ఎవరూ లేకపోతే, గ్రామ సభ నిర్వహించి డిగ్రీ మార్కుల ఆధారంగా అప్లికేషన్లు తీసుకుని ఎక్కువ మార్కులు వచ్చిన వారిని సెక్రటరీలుగా తీసుకోవాలని సీఎస్ ఆదేశించినట్లు డీపీవోలు చెబుతున్నారు. ఈనెల 11 తోనే సెక్రటరీల బాండ్ ముగిసినందున వారికి, ప్రభుత్వానికి సంబంధం లేదని జిల్లా అధికారులతో సీఎస్ అన్నట్లు సమాచారం. 

సీఎం ఆదేశాలతోనే మీటింగ్!

రెండు రోజుల కిందట చర్చలు జరుపుతామని సెక్రటరీలను హైదరాబాద్‌కు మంత్రి ఎర్రబెల్లి పిలిచి.. తర్వాత రద్దు చేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా సమ్మెపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాలతో చీఫ్ అడ్వైజర్ సోమేశ్‌ కుమార్, సీఎస్ శాంతి కుమారి, పీఆర్ అధికారులతో చర్చించి కొంత మందిని సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.