పరిహారం ఇవ్వరు.. కొత్త ఇల్లు కట్టుకోనివ్వరు..

పరిహారం ఇవ్వరు.. కొత్త ఇల్లు కట్టుకోనివ్వరు..

ఇండ్లల్లో నీటి ఊటలు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగంబండ డ్యాం ముంపు ప్రజలు
డ్యాం గ్రౌండ్ వాటర్ ఎక్కువై ఇళ్లలోకి..
గోడలు నాని కూలే దశలో ఇండ్లు
పునరావాసం పదిహేనేళ్లుగా పెండింగ్

మక్తల్ / మాగనూర్, వెలుగు: ఓ వైపు ప్రభుత్వం పునరావాసం కల్పించక.. మరోవైపు ఎప్పుడు కూలుతాయో తెలియని ఇంట్లో ఉండలేక ముంపు గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గోడలు నానుతున్నా రిపేర్లుచేయించుకోలేని పరిస్థితి. కొత్త ఇల్లుకట్టుకుందామంటే పర్మిషన్ ఉండదు. దీంతో నీటి ఊటలుగా మారుతున్నఇండ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం నెరడగం గ్రామ ఎగువన 2005లో సంగంబండ ప్రాజెక్టు నిర్మించారు. ఈ డ్యాం నిర్మాణానికి నెరడగం గ్రామ రైతులు 3,500 ఎకరాల భూమిని ఇచ్చారు. వారికి పునరావాసం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటికీ ఆ పని జరగలేదు. పదిహేనేళ్లు అవుతున్నాఈ విషయంపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. 2009లో ఈ గ్రామాన్ని ముంపు ప్రాంతంగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ ఫండ్స్ సాంక్షన్ చేయలేదు. నేటికీ ఆర్ ఆర్ సెంటర్ ఏర్పాటు కాలేదు. డ్యాం దిగువన వంద మీటర్ల దూరంలోనే నెరడగం గ్రామం ఉంది. డ్యాంలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడల్లా ఇళ్లలోకి నీరు ఊటల రూపంలో వస్తోంది. ప్రస్తుతం వరుసగా వర్షాలు కురుస్తుండడంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది.

ఇరిగేషన్ ఆఫీసర్ల సర్వే ఉత్తిదేనా..
2009 సంవత్సరంలో నెరడగం గ్రామంలో ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే చేసి 746 ఇండ్లను గుర్తించారు. ఇంటి నంబర్లువేసి నివేదికను అప్పటి కలెక్టర్ పురుషోత్తంకు పంపించారు. కానీ ఇప్పటివరకు పునరావాసం మాత్రం కల్పించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు వ్యవసాయ భూములకు సంబంధించి పరిహారం ఇచ్చినప్పటికీ ఇండ్లస్థలాల పరిహారం ఇవ్వలేదని నిర్వాసితులు పేర్కొన్నారు.

ఉండలేక.. వెళ్ల లేక..
ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో నెరడగం గ్రామస్తులు బయటికి వెళ్లలేకపోతున్నారు. ఎప్పటికైనా ఊరు ఖాళీ చేయాల్సి ఉండడంతో ఇండ్లకు రిపేర్లు కూడా చేయించుకోవడం లేదు. ఇటీవల వరుసగా కురుస్తున్న వానలకు గ్రామంలో 21 ఇండ్లు నేలమట్టమయ్యాయి. కొన్నివర్షానికి తడిసి పాక్షికంగా దెబ్బతిన్నాయి. వందకు పైగా ఇండ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు.

ఇంటి నిర్మాణాలకు నో పర్మిషన్..
వానొచ్చినప్పుడల్లా ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. వేరే చోట పునరావాసం కల్పించాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోతున్నారు. కొందరు కొత్త ఇల్లుకట్టేందుకు ప్రయత్నిస్తే ఆఫీసర్లు పర్మిషన్ లేదంటూ అడ్డుకుంటున్నారని బాధితులు అంటున్నారు. ఇల్లు కట్టుకోనివ్వక, మరోచోట పునరావాసం కల్పించక తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం స్పందించాలి
పునరావాసం కల్పించాలని ఆఫీసర్లకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. మా గ్రామ అభివృద్ధికి ఫండ్స్ ఆపేశారు. ప్రభుత్వం స్పందించి ఇళ్లకు పరిహారం అందించి పునరావాసం కల్పించాలి.
– అశోక్ గౌడ్, సర్పంచ్, నెరడగం

ఇల్లు కూలిపోయింది
డ్యాం మా ఇంటికి దగ్గర్లోనే ఉంది. ఇంట్లోకి నీటి ఊట వస్తోంది. దీనికి తోడు ముసురు వర్షాల వల్ల మా ఇల్లు కూలిపోయింది. ఎక్కడ ఉండాలో తెలియడం లేదు. పునరావాసం కల్పించాలి.
– బుగ్గి మహాదేవమ్మ, నెరడగం

ఫైల్ పెండింగ్లో ఉంది..
2009లో నెరడగం గ్రామానికి పునరావాసం కల్పించాలని జీవో జారీ అయింది. కానీ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో పడింది. ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
– వైపీ రమేశ్, తహసీల్దార్, మాగనూర్

For More News..

పేదలకు పైసా ఖర్చు లేకుండా ‘డబుల్‌‌‌‌’ ఇండ్లు

ప్యాచ్‌‌‌‌ వర్క్ చేస్తలే.. కొత్త రోడ్డు వేస్తలే