
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వచ్చే నెల 2న సెక్రటేరియెట్లో చర్చలకు ఓకే చెప్పింది. ఉద్యోగ జేఏసీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలకు ఆహ్వానించారు. సమస్యలు పరిష్కరించాలంటూ సెప్టెంబర్ 1 నుంచి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని ఇటీవల ఉద్యోగ జేఏసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2వ తేదీన ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాస్‌రావు గురువారం ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
‘‘పీఆర్సీ, పెండింగ్ డీఏ, ఈహెచ్ఎస్, మెడికల్ బిల్లులువంటి మొత్తం 57 సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తున్నది. వీటి పరిష్కారం కోసం ఐఏఎస్‌లు నవీన్ మిట్టల్, లోకేశ్‌కుమార్, కృష్ణభాస్కర్ తో ఉన్నతాధికారుల కమిటీ వేసింది’’అని పేర్కొన్నారు. కాగా, గురువారం సెక్రటేరియెట్లో ఉన్నతాధికారుల కమిటీతో డిప్యూటీ సీఎం 3 గంటల పాటు భేటీ అయి సమస్యలపై చర్చించారు.