కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్నచర్యలను ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చినంత మాత్రాన పరిస్థితులు మారతాయా అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. హైకోర్టుకు సమాధానం ఇవ్వడంలో అభ్యంతరం లేదని అయితే వాస్తవ పరిస్థితులను దాచడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వనున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఘాటుగా స్పందించిన తీరు చూస్తుంటే హెల్త్ ఎమర్జీన్సీ విధించాల్సిన అవసరం ఉన్నదని పొన్నం అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో కరోనా టెస్టింగ్ కెపాపిటీ పెంచాలని, ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, పూర్తిగా నైతికతను కోల్పోయిందన్నారు. కరోనా చికిత్సల విషయంలో కార్పొరేట్ ఆస్పత్రుల ఆజమాయిషీని ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పొన్నం.

