రూ.25 కోట్లు పెడితే ఉస్మానియాను కొన్నేళ్లు వాడుకోవచ్చు!

రూ.25 కోట్లు పెడితే ఉస్మానియాను కొన్నేళ్లు వాడుకోవచ్చు!

ఉస్మానియా జనరల్​ హాస్పిటల్. ఎంతో చరిత్ర ఉన్న ప్రభుత్వ దవాఖాన. అయితే ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్​ పై చాలా రోజులుగా రగడ చెలరేగుతోంది. దీనిని కూల్చేసి కొత్తది కట్టాలని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అయితే రూ.25 కోట్లతో భవనానికి మరమ్మతులు చేయిస్తే కొన్నేళ్లు బ్రహ్మాండంగా వాడుకోవచ్చని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) అధికారులు సర్వే చేసి మరీ తేల్చినట్లు సమాచారం. హెరిటేజ్ బిల్డింగ్‌ను పలుమార్లు పరిశీలించిన ఏఎస్ఐ టీం ఇటీవలే వైద్యారోగ్య శాఖ అధికారులకు రిపోర్ట్​ ఇచ్చినట్లు తెలిసింది. బిల్డింగ్ సామర్థ్యం బాగానే ఉందని, రెండేళ్లలో పనులు చేస్తే మరికొన్నేళ్లు వాడుకోవచ్చని సూచించినట్లు సమాచారం.

ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్‌‌పై రంది అవసరం లేదట. రూ.25 కోట్లతో మరమ్మతులు చేయిస్తే బిల్డింగ్‌‌ జబర్దస్త్‌‌ అయితదట. మరి కొన్నేళ్లు వాడుకోవచ్చట. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌‌ఐ) అధికారులు సర్వే చేసి ఈ విషయాన్ని తేల్చినట్లు సమాచారం. హెరిటేజ్ బిల్డింగ్‌‌ను పలుమార్లు పరిశీలించిన ఆర్కియాలజీ టీం ఇటీవలే వైద్యారోగ్య శాఖ అధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. బిల్డింగ్ సామర్థ్యం బాగానే ఉందని, రెండేళ్లలో పనులు చేస్తే మరికొన్నేళ్లు వాడుకోవచ్చని సూచించినట్లు సమాచారం. ప్రతి గదినీ పరిశీలించిన పురావస్తు బృందం ఎక్కడెక్కడ మరమ్మతులు అవసరమో ఎస్టిమేషన్‌‌ సిద్ధం చేసినట్లు తెలిసింది.

ఇప్పటికే పై అంతస్తు ఖాళీ

1925లో నిర్మించిన ఉస్మానియా హాస్పిటల్‌‌ బిల్డింగ్‌‌ శిథిలావస్థకు చేరిందంటూ పేషెంట్లను పేట్ల బురుజు, సుల్తాన్ బజార్ మెటర్నరీ హాస్పిటల్స్‌‌కు మార్చాలని గతంలో భావించారు. సాధ్యం కాకపోవటంతో ఇక్కడే వైద్యం అందిస్తున్నారు. ఆ మధ్య బిల్డింగ్‌‌ పై అంతస్తులో పలుమార్లు పెచ్చులు ఊడటంతో దాన్ని ఖాళీ చేశారు. ప్రస్తుతం  గ్రౌండ్ ఫ్లోర్‌‌, ఫస్ట్​ ఫ్లోర్​లోనే రోగులకు సేవలందిస్తున్నారు. మూడేళ్ల క్రితం బిల్డింగ్‌‌ను జేఎన్టీయూ బృందం పరిశీలించింది. రోగులకు ఇక్కడ చికిత్స చేయడం మంచిది కాదని, వెంటనే ఖాళీ చేయాలని చెప్పింది. తాజాగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కూడా రిపోర్టిచ్చింది. కానీ దీని నివేదిక ఇతర సంస్థల రిపోర్టు కన్నా భిన్నంగా ఉందని తెలిసింది.

అటు పాతది.. ఇటు కొత్తది

హెరిటేజ్ బిల్డింగ్‌‌ను కూల్చి అక్కడే కొత్తగా టవర్స్ నిర్మించాలని తొలుత భావించారు. కానీ కూల్చొద్దని ఆందోళనలు చేయడంతో ప్రతిపాదన విరమించుకున్నారు. పాత భవనాన్ని అట్లే ఉంచి ఖాళీ చేయించాలని నిర్ణయించారు. కొత్త బిల్డింగ్‌‌ వచ్చాక అన్ని విభాగాలను తరలించాలనుకున్నారు. మరోవైపు హాస్పిటల్‌‌కు వస్తున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2017లో 5.77 లక్షల మంది ఉస్మానియాకొస్తే 2018లో ఈ సంఖ్య 9.56 లక్షలకు పెరిగింది. దీంతో ప్రస్తుత బిల్డింగ్‌‌ ఏమాత్రం సరిపోవడం లేదు. కానీ ఆర్కియాలజీ విభాగం నివేదికను అమలు చేస్తే పాత బిల్డింగ్‌‌ పూర్తిగా వాడుకునే అవకాశం ఉంది. లేదంటే అడ్మినిస్ట్రేషన్‌‌కు వాడాలని ఆలోచిస్తున్నారు.

త్వరలోనే కొత్త బిల్డింగ్ పనులు

2015లో ఉస్మానియాను సందర్శించిన సీఎం కేసీఆర్ కొత్త బిల్డింగ్‌‌ కోసం రూ. 200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో కొత్త బిల్డింగ్‌‌ నిర్మాణంపై ముందడుగు పడొచ్చని తెలుస్తోంది. హెరిటేజ్ బిల్డింగ్‌‌తో సంబంధం లేకుండా కొత్తగా నిర్మించాలనుకుంటున్న టవర్స్‌‌పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.