దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తీరు ఇప్పటికీ మారటం లేదు. విమానాలను ఉన్నట్లుండి రద్దు చేస్తూ వేల మంది ప్యాసెంజర్లకు చుక్కలు చూపించిన ఇండిగో.. డీజీసీఏ పనిష్మెంట్ తర్వాతనైనా పద్ధతి మార్చుకుంటుంది అనుకుంటే.. మళ్లీ పాతపాటే పాడుతోంది. షెడ్యూల్ ప్రకారం సర్వీసులు నడపకుండా ప్యాసెంజర్లతో ఆటలు ఆడుకుంటోంది. మంగళవారం (ఫిబ్రవరి 24) దాదాపు 5 గంటల పాటు ఫ్లైట్ ను డిలే చేసి ప్యాసెంజర్లకు నరకం చూపించింది.
చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఫ్లైట్ 5 గంటలకు పైగా విమానాశ్రయంలోనే ఉండిపోయింది. దీంతో 200 మంది ప్యాసెంజర్లు ఫ్లైట్ లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కాక.. ఎటూ కదలలేని స్థితిలో విమానంలో కూర్చోలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఛెన్నై ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళన చేస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
క్యాబిన్ టెంపరేచర్ నార్మల్ కంటే ఎక్కువగా ఉండటంతో పైలెట్ ఇంజిన్ స్టార్ట్ చేయలేదని ఇండిగో అధికారులు తెలిపారు. ఇంజినీర్లకు సమాచారం ఇవ్వడంతో కాప్ పిట్ సిబ్బంది.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ ను (FDTL) పెంచినట్లు పేర్కొన్నారు. ఆల్టర్నేట్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఇష్యూను రిజాల్వ్ చేస్తామని చెప్పారు.
సోషల్ మీడియాలో ప్యాసెంజర్స్ షేర్ చేసిన వీడియోలో, ఎయిర్ కండిషనింగ్ ఆన్, ఆఫ్ చేయడం వల్ల తమకు ఊపిరాడకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం ఎందుకు ఆలస్యమైందో చెప్పకుండా CISF సిబ్బందితో బెదిరించారని ప్రయాణికులు ఆరోపించారు.
►ALSO READ | లక్నో మర్డర్ కేసు: పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
సింగపూర్ వెళ్లే విమానం (6E1025) ఉదయం 7.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. ప్రయాణీకులను ఉదయం 6.30 గంటల నుండి ఎక్కడానికి అనుమతించారు. కానీ విమానం షెడ్యూల్ ప్రకారం బయలుదేరలేదు. దీని గురించి సరైన కమ్యూనికేషన్ లేదు. క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ పదేపదే ఆన్, ఆఫ్ చేస్తుండటం వల్ల.. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంత ఇబ్బందుల్లో తమను కనీసం కిందికి దిగనివ్వలేదు. కింద వెయిట్ చేస్తామని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో నరకం చూశాము.. అంటూ వీడియోలో వాపోయారు.
సంక్షోభం మరువకముందే..
విమాన ప్రయాణాలు చేస్తుండేవారికి ఇటీవల ఇండిగో సంక్షోభం గురించి బాగా తెలిసి ఉంటుంది. పైలట్ ల విశ్రాంతి సమయంలో డీజీసీఏ నిబంధనలు పాటించకుండా ఇండియా విమానయాన రంగాన్నే పెద్ద సంక్షోభంలోకి నెట్టేసింది ఇండిగో. నవంబర్ 1, 2025 నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల రెండో దశ ఈ సంక్షోభానికి ప్రధాన మూలకారణం. ఈ నిబంధనలు పైలట్‌ల వారపు విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచాయి. ఇది పైలట్‌ల అలసట రిస్క్‌ను తగ్గిస్తుంది. ఈ మార్పులు విమాన ప్రయాణాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచాలని లక్ష్యంగా చేసిన ప్రయత్నం.
ఈ నిబంధనల గురించి రెండు సంవత్సరాల ముందు నుంచే పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, కొత్త నిబంధనలకు అనుగుణంగా తగినంత మంది సిబ్బందిని సమకూర్చుకోవడంతోపాటు రోస్టరింగ్ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇండిగో నిర్లక్ష్యం వహించింది. భారతదేశంలో అత్యధిక విమానాలను నడుపుతున్న సంస్థగా, సిబ్బంది కొరతను సరిచేయడానికి ఇండిగో ప్రణాళికా లోపం సంస్థ కార్యకలాపాలను ఒక్కసారిగా కుప్పకూల్చింది.
