
- రెండు ప్రాజెక్టుల కెపాసిటీలో 200 టీఎంసీల మేర కోత
- పూడిక తీస్తే కనీసం సగమైనా అందుబాటులోకి వస్తుందని ఇరిగేషన్ శాఖ యోచన
- త్వరలోనే పూడికతీసే కంపెనీలతో డెమో
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాలకు సాగునీరందించే ఆధునిక దేవాలయాలు నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు. అయితే, కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాజెక్టుల్లో పూడిక పేరుకుపోయి వాటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఆ రెండు ప్రాజెక్టుల్లో కలిపి దాదాపు 200 టీఎంసీల మేర కెపాసిటీ పడిపోయింది. ఈ క్రమంలోనే ఆ రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో నిల్వ కెపాసిటీని పునరుద్ధరించేందుకు సర్కారు కసరత్తులు చేస్తున్నది.
ఆ రెండు ప్రాజెక్టులతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడికతీసేందుకు వివిధ సంస్థలతో ఇరిగేషన్ శాఖ త్వరలోనే డెమోలు తీసుకోబోతున్నట్టు తెలిసింది. ఆ డెమోల ఆధారంగా పూడికతీతకు సంబంధించి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను పెట్టడం.. ఆ తర్వాత టెండర్లను పిలవడం వంటి పనులను చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.
మార్కెట్లో ఎక్స్ పీరియన్స్ ఉండి.. పూర్తి టెక్నాలజీ అందుబాటులో ఉన్న సంస్థలకే ఆ రెండు ప్రాజెక్టుల పూడికతీత పనిని అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. రెండు ప్రాజెక్టులకు వేర్వేరు సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తే పని సులభంగా వేగంగా పూర్తి చేసేందుకు వీలవుతుందని చెబుతున్నారు. మొత్తంగా ఆ రెండు ప్రాజెక్టుల్లో పూడుకుపోయిన దాంట్లో కనీసం వంద టీఎంసీలనైనా తిరిగి వినియోగంలోకి తెచ్చుకునేలా డిపార్ట్మెంట్ కసరత్తులు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.
మెల్లమెల్లగా..
నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టుల్లో పూడిక తీయడం అంత సులభమైన పని కాదు. అందుకే ఆ రెండు భారీ ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యాన్ని మెల్లమెల్లగా పునరుద్ధరిస్తే భవిష్యత్‌లోనైనా నీటిని వాడుకునేందుకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 405 టీఎంసీల సామర్థ్యం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సామర్థ్యం 312 టీఎంసీలకు పడిపోయింది. దాదాపు వంద టీఎంసీల వరకు సామర్థ్యం తగ్గిపోయింది.
ఇటు శ్రీశైలం ప్రాజెక్టును 308 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తే దాని కెపాసిటీ ఇప్పుడు 216 టీఎంసీలకు తగ్గింది. ముఖ్యంగా 2009లో వచ్చిన భారీ వరదల ధాటికే ఆ రెండు ప్రాజెక్టుల్లో భారీగా పూడిక పేరుకుపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీటి సామర్థ్యం తగ్గడంతో వేసవి వచ్చే సరికి నీటి లభ్యత రెండు ప్రాజెక్టుల్లోనూ వేగంగా తగ్గిపోతున్నది. ఒక్కోసారి వేసవి తాగునీటి అవసరాలు తీరకముందే ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరుకుంటున్నాయి.
దీంతో ఆ రెండు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తే ఇటు సాగునీటితో పాటు అటు తాగునీటి అవసరాలూ తీరుతాయని ఇరిగేషన్ శాఖ భావిస్తున్నది. కాగా, ఇటు నిజాంసాగర్ ప్రాజెక్టులోనూ పూడిక తీయాలని సర్కారు యోచిస్తున్నది. మరోవైపు ఇప్పటికే కడెం, లోయర్ మానేరు, మిడ్ మానేరు ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వివిధ సంస్థలకు అప్పగించారు. ఏటా రూ.70 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుల్లో పూడికతీత పనులు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు.