గర్భిణుల్లో పోషకాహారలోపం, రక్తహీనత

గర్భిణుల్లో పోషకాహారలోపం, రక్తహీనత

మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్​హాస్పిటళ్లలో సిజేరియన్ల సంఖ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో గవర్నమెంట్​నార్మల్​డెలివరీలపై ఫోకస్​పెట్టింది. సాధ్యమైనంత వరకు సిజేరియన్లు తగ్గించి సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని మెడికల్​అండ్​హెల్త్​మినిస్టర్​ హరీశ్​రావు ఆదేశాలు జారీ చేశారు. అనవసరంగా ఆపరేషన్లు చేసే డాక్టర్లపై యాక్షన్​ తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆశయం మంచిదే అయినప్పటికీ ఇందుకు చాలా ఆటంకాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో ముహూర్తపు డెలివరీలను ప్రోత్సహించడం వల్ల ఎక్కువ సంఖ్యలో ఆపరేషన్లు జరుగుతున్నాయని అంటున్నారు.  ఈ సమస్యలకు పరిష్కారం చూపకుండా నార్మల్ డెలివరీల సంఖ్య పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. 

పోషకాహార లోపం, రక్తహీనత

రాష్ట్రవ్యాప్తంగా చాలామంది మహిళలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు లాంటి​ జిల్లాల్లో ఏజెన్సీ ఏరియాకు చెందిన గిరిజన ఆదివాసీ మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. విటమిన్​ బీ12 లోపం కనిపిస్తోంది. పోషకాహార లోపం రక్తహీనతకు దారితీస్తోంది. హాస్పిటల్​కు వచ్చే గర్భిణుల్లో చాలా మందికి హిమోగ్లోబిన్​ 7 నుంచి 10 గ్రాముల లోపే ఉంటోంది. దీనివల్ల ఉమ్మనీరు లేకపోవడం, శిశువులో ఎదుగుదల లోపం, ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటివారికి నార్మల్​డెలివరీ కావడం కష్టం. తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్లు చేయాల్సి వస్తోందని డాక్టర్లు చెప్తున్నారు. 

నామమాత్రంగా వైద్యసేవలు

గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యసేవలు అందకపోవడం కూడా నార్మల్ డెలివరీలకు ప్రధాన అవరోధంగా మారింది. గర్భిణులు, వారి కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు నెలనెలా చెకప్​చేయాలి. కానీ మెజారిటీ పీహెచ్​సీల్లో గైనకాలజిస్టుల లేకపోవడంతో నెలనెలా చెకప్​లు చేయించుకోవడం లేదు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు గర్భిణుల పేర్లు నమోదు చేసుకొని రెండు మూడు నెలలకోసారి దగ్గరలోని హాస్పిటళ్లకు తీసుకెళ్తున్నారు. డాక్టర్లు అందుబాటులో ఉన్న మందులు ఇస్తున్నారు. చాలా హాస్పిటళ్లలో ల్యాబ్​ టెక్నీషియన్లు లేకపోవడం వల్ల బ్లడ్​ టెస్టులు కూడా చేయడం లేదు. స్కానింగ్​జిల్లా హాస్పిటల్​లో మాత్రమే అందుబాటులో ఉంది. మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫాబాద్​ జిల్లా వారికి మంచిర్యాల జిల్లా హాస్పిటల్​ మాత్రమే డెలివరీలకు పెద్ద దిక్కుగా మారింది. గర్భిణులు దూరప్రాంతాల నుంచి ఆలస్యంగా రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ముహూర్తం చూసి..

ఇటీవలి కాలంలో మహూర్తాలు చూసుకొని డెలివరీలు చేయించే ధోరణి పెరిగింది. ప్రైవేట్​హాస్పిటళ్లలో ఈ తరహా డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పురోహితులు, గైనకాలజిస్టులతో మీటింగ్​ ఏర్పాటు చేశారు. పురోహితులు ముహూర్తాలు చూడొద్దని, గైనకాలజిస్టులు ముహూర్తపు డెలివరీలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. హాస్పిటళ్లలో ‘ముహూర్తపు డెలివరీలు చేయబడవు’ అని బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్​ హాస్పిటళ్లలో ఆపరేషన్లకు రూ.40 వేల నుంచి రూ.50వేలు వసూలు చేస్తున్నారు. కాసుల కక్కుర్తికి అలవాటుపడ్డ హాస్పిటళ్లలో ఇది ఎంతవరకు కంట్రోల్​అవుతుందన్నది అనుమానమే. 

ఎక్సర్​సైజ్​లు, కౌన్సెలింగ్​ లేవు 
నార్మల్​డెలివరీల సంఖ్య పెరగాలంటే గర్భిణులను శారీరకంగా, మానసికంగా అందుకు సిద్ధం చేయడానికి ఎక్సర్​సైజ్​లు, కౌన్సెలింగ్​ చాలా కీలకం. జిల్లా హాస్పిటల్​లో డెలివరీ టైమ్​లో మాత్రమే ఎక్సైర్​సైజ్​లు చేయిస్తున్నారు. ఇటీవలి కాలంలో మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి బెడ్​రెస్ట్​కు పరిమితం అవుతున్నారు. శారీరక శ్రమకు దూరంగా ఉండడం వల్ల బరువు పెరగడం, కండరాలు బిగుసుకుపోవడం జరుగుతోంది. గర్భిణులు ఓవైపు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు శారీరక శ్రమ, ఇంటిపనులు చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నిపుణుల సలహాలతో ఎక్సర్​సైజ్​లు, యోగా, వాకింగ్​ వంటివి రెగ్యులర్​గా చేయాలంటున్నారు. నార్మల్ డెలివరీ కావాలంటే 18 నుంచి 24 గంటల పాటు పురిటినొప్పులను భరించాలి. కానీ చాలామంది ఈ నొప్పులను తట్టుకోలేకపోతున్నారు. దీంతో కుటుంబసభ్యులు సైతం సిజేరియన్​ చేయాలంటూ డాక్టర్లను ఒత్తిడి చేస్తున్నారు.

నార్మల్​కే ట్రై చేస్తున్నం 

జిల్లా హాస్పిటల్​లో సాధ్యమైనంత వరకు నార్మల్​డెలివరీలు చేయడానికే ప్రయత్నిస్తున్నం. ఎక్సర్​సైజ్​లు చేయిస్తున్నం. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్లు చేస్తున్నాం. చాలామంది రక్తహీనత, ఉమ్మనీరు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పురిటినొప్పులను తట్టుకోలేకపోతున్నారు. బీపీ కంట్రోల్ కావడం లేదు. చిన్న వయసులో లేదా ఆలస్యంగా గర్భం దాల్చడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. సిజేరియన్​ కారణంగా ఫ్యూచర్​లో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పినా కొంతమంది అర్థం చేసుకోవట్లే.  
– డాక్టర్​అనిత, గైనకాలజిస్టు, మంచిర్యాల జిల్లా హాస్పిటల్