
- ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
- నెలకు రూ.15,600 గౌరవ వేతనం ఇవ్వనున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 1,597 మంది లష్కర్లు, 281 మంది హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వారిని నియమించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఓ కమిటీని ఏర్పాటు చేసి లష్కర్లను నియమించనుంది. ఈఎన్సీ లేదా సీఈ చైర్మన్‌గా ఉండనున్న ఈ కమిటీలో ఎస్‌ఈ, డీఈఈలు సభ్యులుగా ఉండనున్నారు. ఆ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఏయే చోట్ల లష్కర్లను నియమించాలనుకుంటున్నారో ఆయా గ్రామాల పరిధిలోని వారికి మాత్రమే ఉద్యోగం ఇచ్చేలా కసరత్తులు చేస్తున్నారు.
తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు నిరంతరం కాలువలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని ఇరిగేషన్ శాఖ భావిస్తున్నది. అయితే, నియామకాలను చదువుతో సంబంధం లేకుండా చేపట్టాలని భావిస్తున్నది. రాయడం, చదవడం వచ్చి ఉండి.. నియామకం జరపాలనుకుంటున్న ప్రాంతానికి చెందిన వారై ఉంటే చాలని యోచిస్తున్నది. 45 ఏండ్లలోపు వారిని నియమించాలని భావిస్తున్నది. ఏ ప్రాతిపదికన నియామకం చేపట్టాలన్న దానిపై త్వరలోనే గైడ్ లైన్స్‌ను రూపొందించనున్నారు. వాస్తవానికి లష్కర్ల కొరత వల్లే కాల్వలకు గండ్లు పడుతున్నాయని ఇటీవల అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్న లష్కర్లు, హెల్పర్లకు నెలకు రూ.15,600 గౌరవ వేతనం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.