పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్ కు మరో ఛాన్స్

పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్ కు మరో ఛాన్స్
  •    మరో చాన్స్ ఇచ్చిన ప్రభుత్వం
  •     ఈ నెల 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  •     జీవో నంబర్ 14 జారీ చేసిన సీఎస్

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూములు, అర్బన్ సీలింగ్ యాక్ట్ పరిధిలోని భూముల్లో ఇండ్లు కట్టుకున్న పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్‌‌‌‌కు రాష్ట్ర సర్కార్ మరో అవకాశమిచ్చింది. 58, 59 జీవోల ప్రకారం ఈ నెల 21 నుంచి మార్చి 31 వరకు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇదే చివరి చాన్స్ అని పేర్కొంటూ సీఎస్ సోమేశ్‌‌‌‌ కుమార్ జీవో నంబర్ 14ను సోమవారం రిలీజ్ చేశారు. 2014, 2015, 2017లోనూ ప్రభుత్వం ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌‌‌‌కు అవకాశం కల్పించింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 11.19 లక్షల దరఖాస్తులు రాగా, ఉచితంగా 6.18 లక్షల మంది దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించింది. మిగతా వాటికి విస్తీర్ణం ఆధారంగా ధర నిర్ణయించి రెగ్యులరైజ్ చేసింది.

రెగ్యులరైజేషన్ ఇలా..

ప్రభుత్వ భూముల్లో ఉంటున్న పేదల ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌‌‌‌కు జీవో 58, 59ను 2014 డిసెంబర్ 30న సర్కారు విడుదల చేసింది. జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న నిరుపేదలకు స్థలాలను ఉచితంగా రెగ్యులరైజ్ చేయనున్నారు. ఇందుకోసం దరఖాస్తుదారు ఆధార్ కార్డుతోపాటు ఆ స్థలం వారి అధీనంలో ఉన్నట్లు ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, ఎలక్ర్టిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌‌‌‌లో ఏదో ఒక రిసిప్ట్ ను ప్రూఫ్ గా సమర్పించాలి. అలాగే 125 గజాలకు మించిన విస్తీర్ణంలో ఎవరైనా ఇండ్లు నిర్మించుకుని ఉంటే ఇండ్ల విస్తీర్ణం ఆధారంగా ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది. జీవో నంబర్ 59 ప్రకారం 250 గజాల వరకు అధీనంలో ఉంటే.. ల్యాండ్ బేసిక్ వ్యాల్యూలో 50 శాతాన్ని, 500 గజాల వరకు ల్యాండ్ బేసిక్ వ్యాల్యూలో 75 శాతం మొత్తాన్ని, 500 గజాలపైగా స్వాధీనంలో ఉంటే బేసిక్ వ్యాల్యూ మొత్తాన్ని చెల్లించి రెగ్యులరైజ్‌‌‌‌ చేసుకోవాల్సి ఉంటుంది. 59 జీవో ప్రకారం రెగ్యులరైజ్‌‌‌‌ చేసుకునేవాళ్లు ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, ఎలక్ర్టిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌‌‌‌లో ఏదో ఒక రిసిప్ట్ ను ప్రూఫ్ గా సమర్పించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ల పరిశీలనకు ఆర్డీఓ నేతృత్వంలోని తహసీల్దార్‌‌‌‌లతో కూడిన కమిటీలను ప్రభుత్వం నియమించడంతో పాటు వాటి పరిష్కారానికి 90 రోజుల సమయాన్ని ఇచ్చింది.