హాస్టళ్లకు 25 శాతం నూక బియ్యం పంపాలె

హాస్టళ్లకు 25 శాతం నూక బియ్యం పంపాలె

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు మంచి బియ్యం సరఫరా చేయడంలేదు. సన్నబియ్యంతో పిల్లలకు అన్నం పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు.. నూక బియ్యం పంపుతున్నది. హాస్టళ్లలో పంపించే బియ్యంలో 25 శాతం నూక ఉండాలని ఆదేశాలిచ్చింది. గత నెల నుంచి ఇట్లనే సరఫరా చేస్తున్నారు. దీంతో అన్నం బంకబంక, ముద్దముద్ద, మెత్తగా అవుతోంది. ఈ బియ్యం ఎట్ల వండినా అన్నం ఖరాబైతున్నదని వార్డెన్లు వాపోతున్నారు.

నెల రోజులుగా..

రాష్ట్రవ్యాప్తంగా 669 ఎస్సీ, 419 బీసీ ప్రీమెట్రిక్‌‌ హాస్టళ్లు, 204 ఎస్సీ, 278 బీసీ పోస్ట్‌‌ మెట్రిక్‌‌ హాస్టళ్లు ఉన్నాయి. మరో 136 ఎస్టీ హాస్టళ్లు, 326 ఆశ్రమ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 2.6 లక్షల మంది స్టూడెంట్లు ఉంటున్నారు. గతంలో వీరందరికీ సాధారణ బియ్యం సరఫరా చేసేవారు. తర్వాత సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి, అమలు చేస్తోంది. ఇప్పటిదాకా సన్నబియ్యం సరిగానే అందించింది. కానీ కొన్ని రోజుల కిందట సీన్‌‌‌‌ రివర్స్‌‌‌‌ అయ్యింది. హాస్టళ్లకు తరలించే మొత్తం బియ్యంలో 25 శాతం నూక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సివిల్‌‌‌‌ సప్లయ్స్ అధికారులు ఉత్తర్వులు కూడా చేశారు. నెల రోజుల నుంచి పావు వంతు నూక సరఫరా చేస్తున్నారు. తడిసిన ధాన్యం నుంచి తీసిన బియ్యం లెక్కనే ఉంటున్నట్లు వార్డెన్లు చెబుతున్నారు.

మంచిగ వస్తలె

సర్కారు నూక బియ్యం సరఫరా చేస్తుండటంతో గతంలో మాదిరిగా అన్నం మంచిగా కావడంలేదు. నీళ్లు తక్కువగా పోసినా, ఎక్కువగా పోసినా బువ్వ ఖరాబ్ అవుతున్నదని వంట మనుషులు చెబుతున్నారు. అన్నం ముద్దముద్దగా, గడ్డలుగడ్డలుగా, మెత్తగా అవుతోందని అంటున్నారు. దీంతో విద్యార్థులు అన్నం తినడంలేదు. కొంత మంది తింటే కడుపు నొప్పి వస్తోందని తక్కువ తింటున్నారు. మరికొందరు అన్నం తినడం మానేస్తూ బయట చిరుతిండ్లు తింటున్నారు. కొన్ని చోట్ల స్టూడెంట్లు ఆందోళనబాట పడుతున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు కూడా చేశారు. మంచి బియ్యం బంద్‌‌‌‌ చేసి, నూక బియ్యం ఎందుకు ఇస్తున్నరని ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

సబ్బులు, షాంపుల పైసలూ ఇస్తలే

స్టూడెంట్లకు అందించాల్సిన కాస్మోటిక్‌‌‌‌ చార్జీలను ఆఫీసర్లు బంద్‌‌‌‌ చేశారు. నాలుగు నెలలుగా ఇవ్వడం లేదు. బాయ్స్‌‌‌‌కు నెలకు రూ.50, గర్ల్స్‌‌‌‌కు రూ.75 ఇచ్చేవాళ్లు. వీటిని సబ్బులు, ఆయిల్‌‌‌‌, టూత్‌‌‌‌పేస్ట్‌‌‌‌, షాంపూలు, కటింగ్‌‌‌‌, నాప్కిన్స్‌‌‌‌ (గర్ల్స్‌‌‌‌)కు ఉపయోగించాలి. కానీ నెలనెలా ఇవ్వాల్సి ఉన్నా నాలుగు నెలలుగా పత్తాలేకుండా పోయాయి. కరోనాతో మాస్క్‌‌‌‌లు, శానిటైజర్లు అదనంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు 2008 నుంచి అమల్లో ఉన్న కాస్మోటిక్‌‌‌‌ చార్జీలు సరిపోవడంలేదని స్టూడెంట్లు అంటున్నారు. వాటిని పెంచాలని సర్కారుకు రెండు సార్లు సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ అతీగతీలేదు. ప్రస్తుతం ఒక్క ఎస్సీ పోస్ట్‌‌‌‌మెట్రిక్‌‌‌‌ హాస్టళ్లలో మాత్రమే కాస్మోటిక్‌‌‌‌ చార్జీలు ఇస్తున్నారు. బీసీలకు కూడా వర్తింపజేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సన్న బియ్యమే పంపాలె..

స్టూడెంట్లకు సన్న బియ్యం పెడ్తమని కేసీఆర్‌‌‌‌ గొప్పగా గప్పాలు కొడుతున్నరు. ఇప్పుడు కొత్తగా నూకలు పెట్టడం ఏంటి? ఇది దారుణం. ఇప్పటికే హాస్టళ్లలో అరకొర వసతులు కల్పిస్తున్నారు. మరోవైపు కరోనాతో పౌష్టికాహారం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముద్ద అన్నం ఎట్ల తింటరు? పైకి ఒకటి చెప్పి.. ఇంకోటి ఇవ్వడం సరికాదు. ఎప్పటిలాగే సన్న బియ్యాన్ని సప్లయ్ చేయాలి. - శ్రీహరి, సెంట్రల్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌, ఏబీవీపీ