జూడాల స్టైఫండ్‌ పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ 

జూడాల స్టైఫండ్‌ పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ 

రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్ల(జూడాలు) చేపట్టిన సమ్మెకు ప్రభుత్వం ముగింపు పలికింది. ఇవాళ(గురువారం) జూడాలతో చర్చలు జరిపిన తర్వాత 15 శాతం స్టైఫండ్‌ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన స్టైఫండ్‌ ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుంది. సీనియర్ రెసిడెంట్ల వేతనాన్ని ప్రభుత్వం రూ.70 వేల నుంచి రూ.80,500కి పెంచింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో జూడాల సమ్మెకు ఫుల్ స్టాప్ పడింది. డాక్టర్లు, హెల్త్‌ వర్కర్ల కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే.. వారికి నిమ్స్‌ ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స అందించాలన్న డిమాండుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక డెస్కును ఏర్పాటు చేయాలని వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. జూడాలు,సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ప్రభుత్వం ముందు పెట్టిన ఇతర డిమాండ్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందనేది ఇంకా స్పష్టత రాలేదు. 

రాష్ట్రంలో రెండు రోజులుగా జూడాలు సమ్మె బాట పట్టారు. గురువారం(మే 27) నుంచి అత్యవసర సేవలు కూడా బంద్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు 15 శాతం వేతన పెంపుకు ఆమోదం తెలిపింది.