- టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్స్ కంట్రోలర్
- కొత్త పోస్టు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- ఐఏఎస్ ఆఫీసర్ సంతోష్‌కు బాధ్యతలు
- డిప్యూటేషన్‌పై మరో 9 పోస్టుల భర్తీ
హైదరాబాద్, వెలుగు : టీఎస్ పీఎస్సీ ఎగ్జామినేషన్ విభాగానికి ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసింది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సహా మొత్తం పది పోస్టులను కేటాయించింది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా 2017 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ఆఫీసర్ బీఎం సంతోష్ ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండీలో పని చేస్తున్న సంతోష్ అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సమక్షంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మిగిలిన 9 పోస్టులను ప్రస్తుతానికి డిప్యూటేషన్ పై భర్తీ చేయాలని నిర్ణయించారు.
వీటిలో ఎగ్జామ్స్, ఐటీ, లా ఆఫీసర్ల పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులను ఆయా విభాగాల్లో అనుభవమున్న అధికారులతో భర్తీ చేయనున్నారు. కాగా, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీతో సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓవైపు కేసు తేలకుండానే కమిషన్ కొత్త ఎగ్జామ్ డేట్లు ప్రకటించింది. కమిషన్ అధికారులపై ఆరోపణలు ఉండగా, ప్రక్షాళన చేయకుండానే ఎగ్జామ్స్ నిర్వహణలో ముందుకుపోవడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సర్కార్ ఎగ్జామ్స్ నిర్వహణకు కొత్త టీమ్ ను రెడీ చేసింది.
కేసుల కోసం లా ఆఫీసర్..
టీఎస్పీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఎక్కువగా లీగల్ ఇష్యూస్ ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వెయ్యికి పైగా కేసులున్నట్టు తెలుస్తోంది. కమిషన్‌లో పని చేస్తున్న అధికారులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన లేకపోవడంతో కేసులు తొందరగా పరిష్కారం కావడం లేదు. జాబ్స్ కోసం ఏండ్ల తరబడి అభ్యర్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కేసులను త్వరగా పరిష్కరించేందుకు లా ఆఫీసర్‌ను నియమించనున్నారు. ఇందుకోసం జూనియర్ సివిల్ జడ్జి కేడర్ పోస్టును క్రియేట్ చేశారు.
ఇవీ కొత్త పోస్టులు..
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్ వర్క్ అడ్మినిస్ర్టేటర్, జూనియర్ నెట్ వర్క్ అడ్మినిస్ర్టేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్.
