ఉపాధి హామీ అడ్మిన్ ఖర్చులపై సర్కార్ ఆంక్షలు

ఉపాధి హామీ అడ్మిన్ ఖర్చులపై సర్కార్ ఆంక్షలు
  • ఇకపై బడ్జెట్ దాటితే అధికారుల నుంచే రికవరీ
  • పనిదినాల ఆధారంగానే మండలాలకు నిధులు
  • కొత్త గైడ్‌‌లైన్స్ విడుదల చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా నిర్వహణ  ఖర్చులపై ప్రభుత్వం నిబంధనలను కట్టుదిట్టం చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు (డీఆర్డీవో), మండల కంప్యూటర్ కేంద్రాల ఖర్చులకు గరిష్ఠ పరిమితులను విధిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కేటాయించిన బడ్జెట్ కు మించి ఖర్చు చేస్తే బాధ్యులైన అధికారుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని హెచ్చరించారు. 

జిల్లా, మండల స్థాయి కేటాయింపులు..

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల కార్యాలయ నిర్వహణకు ఏడాదికి రూ. 20 లక్షల గరిష్ఠ పరిమితిని విధించారు. ఈ నిధులను నాలుగు త్రైమాసికాలకు విభజించి విడుదల చేయనున్నారు. మొదటి ఆరు నెలలకు రూ.10 లక్షలు, మిగిలిన రెండు త్రైమాసికాలకు ఒక్కో దానికి రూ.5 లక్షల చొప్పున ఖర్చు చేయాలి. ప్రింటింగ్ ఛార్జీలు, ఎంపీడీఓ వాహన ఖర్చులు, ఇతర కొనుగోళ్లను ఈ బడ్జెట్ నుంచి మినహాయించారు.

ఇక, మండల కంప్యూటర్ కేంద్రాలకు ఇచ్చే నిధులను గతేడాది నమోదైన పని దినాల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా (ఏ,బీ,సీ,డీ) వర్గీకరించారు.  ఎ కేటగిరీ కింద 3 లక్షలకు పైగా పనిదినాలున్న 116 మండలాలకు రూ.లక్ష.. బి -కేటగిరీ కింద 2 నుంచి 3 లక్షల పనిదినాలు ఉన్న 187 మండలాలకు రూ. 85 వేలు..సి -కేటగిరీ కింద 1 నుంచి 2 లక్షల పనిదినాలున్న 196 మండలాలకు రూ. 75 వేలు చొప్పున కేటాయించారు.  డి- కేటగిరీ లక్షలోపు పనిదినాలున్న 40 మండలాలకు రూ. 60 వేలు 
కేటాయించారు. 

సామాజిక తనిఖీకి మినహాయింపు.. 

సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) ఖర్చులను అడ్మిన్ బడ్జెట్ నుంచి భరించకూడదు. వాటికోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధులను మాత్రమే వాడాలి. నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను జిల్లాల అకౌంట్స్ ఆఫీసర్లకు, ఫైనాన్స్ మేనేజర్లకు అప్పగించారు.టీఏ, డీఏ ఖర్చులు నిబంధనలకు లోబడి ఉండాలి. అనుమతించిన దానికంటే అదనంగా చెల్లింపులు జరిగినట్లు గుర్తిస్తే, బాధ్యులైన అధికారుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.ఎఫ్​టీవో రిజిస్టర్లలో వేతన జాబితా, వెండర్ వివరాలను పక్కాగా నమోదు చేయాలని, అన్ని రికార్డులను ఆడిటర్లకు తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.