
- నామ్కేవాస్తేగా మారిన 11 ఫెడరేషన్లు
- బడ్జెట్లో పెడుతున్నారుగానీ, నిధులు రిలీజ్ చేయట్లే
- మూడేండ్లుగా ఫెడరేషన్ల ప్రపోజల్స్ అన్నీ చెత్తబుట్టకే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ ఫెడరేషన్లు నామ్ కే వాస్తేగా మారాయి. పదకొండు ఫెడరేషన్లు పేరుకే ఉన్నాయి తప్ప వాటిని రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదు. కనీసం ఫెడరేషన్లకు పాలక మండళ్లనూ ఏర్పాటు చేయట్లేదు. సేవా వృత్తులకు ఆసరాగా నిలవాల్సిన ఫెడరేషన్లు అసలు ఉన్నాయా అనే పరిస్థితికి వచ్చాయి. బడ్జెట్లో ఏటా కోట్ల రూపాయలు పెడుతున్నా.. అందులో పావలా వంతు కూడా ఖర్చు చేయడం లేదు. ఏదైనా స్కిల్డ్ ఉపాధి చేసుకుందాం అనుకుంటున్న లక్షలాది మంది యువతకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ మంజూరు కావడం లేదు. మూడున్నరేండ్లుగా ఫెడరేషన్ల తరపున ఎలాంటి ప్రపోజల్స్ పెట్టినా వాటన్నింటిని ప్రభుత్వం పక్కన పడేస్తూ వస్తోంది. ఒక్క పైసా రిలీజ్ చేయడం లేదు. గడిచిన 8 ఏండ్లలో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ లు, 11 ఫెడరేషన్ల కింద ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.425 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు కలిపి రూ.600 కోట్లు కేటాయించారు. ఫెడరేషన్లకు రూ.7.5 కోట్లు పెట్టారు. కానీ వీటి నుంచి రూపాయి కూడా రిలీజ్ చేయలేదు.
రెండు బడ్జెట్లలో పైసా ఇయ్యలే
బీసీల్లో వివిధ కులాల అభివృద్ధి కోసం 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో రజక, నాయీబ్రాహ్మణ, కల్లుగీత, వడ్డెర, సగర, వాల్మీకి (బోయ), కృష్ణ బలిజ (పూసల), భట్రాజు, కుమ్మరి, మేదర, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్లు ఉన్నాయి. ఆయా ఫెడరేషన్ల నుంచి సబ్సిడీ రుణాలు, కులవృత్తులపై శిక్షణ, సబ్సిడీ కింద మెషీన్లు అందజేయాలి. కానీ గత రెండు బడ్జెట్లలో ఫెడరేషన్లకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం కేటాయించలేదు. ఇక దర్జీ, సంచార జాతుల ఫెడరేషన్ల ఉనికే లేదు. ఈ రెండూ ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. రుణాలు ఇవ్వకుండా, పాలక మండళ్లు ఏర్పాటు చేయకుండా ఈ కులాల వారిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఎంబీసీ.. ఆఫీస్ కే దిక్కు లేదు
అత్యంత వెనకబడిన కులాల ప్రతినిధులతో 2015లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఏటా బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లను ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పారు. తరువాత నాలుగు సార్లు హడావుడిగా మీటింగులు పెట్టారు. చివరకు నాలుగేండ్ల క్రితం ఎంబీసీ కమిషన్ ఏర్పాటు అయింది. కానీ , ఎంబీసీ కార్పొరేషన్ ఆఫీసుకు కూడా దిక్కు లేకుండా పోయింది. ఈ కార్పొరేషన్ మొదటి చైర్మన్ గా తాడూరి శ్రీనివాస్ ను నియమించి ప్రభుత్వం చేతులు దులపుకున్నది. కార్పొరేషన్‌కు రూ.4 వేల కోట్లు కేటాయించినా ఇంతవరకు రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయలేదు.
5.77 లక్షల మంది ఎదురుచూపులు
రాష్ట్రంలో వివిధ ఫెడరేషన్లు, బీసీ కార్పొరేషన్ వద్ద మూడేండ్ల కింద స్వీకరించిన 5.77 లక్షల సబ్సిడీ లోన్ అప్లికేషన్లుపెండింగ్‌లో ఉన్నాయి. సేవా వృత్తులను ఆధునీకరించేందుకు ప్రభుత్వం కేటగిరీల వారీగా రుణాలను ఇవ్వాలని 2018 జులై 26న 190 జీవో ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. రూ. లక్ష నుంచి రూ. 12 లక్షల వరకు లోన్లను సబ్సిడీతో అందించనున్నట్టు అందులో పేర్కొంది. దీంతో వివిధ ఫెడరేషన్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 5.77 లక్షల మంది రుణాల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో అప్పుడు ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ.186 కోట్లు ఇవ్వడం మినహా ఆ తరువాత ప్రభుత్వం వాటికి నిధులు రిలీజ్ చేయలేదు.
బీసీలను పట్టించుకోవట్లేదు
రాష్ట్ర ప్రభుత్వం బీసీలను పట్టించుకోవడం లేదు. లోన్ల కోసం లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తున్నరు. పెండింగ్‌లో ఉన్నవాటికి అప్రూవల్ ఇవ్వాలి. కొత్త సబ్సిడీ లోన్లకు అప్లికేషన్లు తీసుకుని వాటిని కూడా మంజూరు చేయాలి. దళిత బంధు, గిరిజన బంధు లెక్కనే బీసీల కోసం ప్రత్యేక స్కీం అమలు చేయాలి. బీసీల నుంచి ఆందోళన మొదలైతే.. సర్కార్ దిగి వచ్చేదాకా కొట్లాడుతాం.
- ఆర్.కృష్ణయ్య, రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు