- కొరడా ఝలిపిస్తున్న ఇంటర్ బోర్డు
- రెండేళ్లలో వెయ్యి కాలేజీల నుంచి రూ.10 కోట్ల పెనాల్టీలు
- అఫిలియేషన్ల ప్రక్రియలోనూస్పీడు పెంచిన బోర్డు
హైదరాబాద్, వెలుగు: నిబంధనలు తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు భారీగా ఫైన్లు వేస్తున్నది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండేండ్ల నుంచి పెనాల్టీల మోత మోగించింది. దీంతో ఇంటర్ బోర్డు ఖజానాకు గత రెండేండ్లలోనే రూ.10 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. గత రెండేండ్లలో ఇంటర్ బోర్డు పెనాల్టీల వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. 2023–-24లో కేవలం రూ.57 లక్షలు ఉన్న పెనాల్టీలు.. ఆ తర్వాత భారీగా పెరిగాయి. 2024–-25లో నిబంధనలు ఉల్లంఘించిన 485 కాలేజీల నుంచి రూ.4.80 కోట్లు వసూలు చేయగా.. ఈ ఏడాది (2025–-26) ఇప్పటివరకు 502 కాలేజీలకు ఫైన్లు వేసి ఏకంగా రూ.5.44 కోట్లు వసూలు చేశారు. దీంతో రెండేండ్లలోనే రూ. 10.24 కోట్లు బోర్డు ఖాతాలో జమ అయ్యాయి. ముఖ్యంగా అఫిలియేషన్లు ఆలస్యంగా తీసుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ రూల్స్ పాటించని 376 కాలేజీలకు ఈ ఏడాదే రూ. 3.79 కోట్ల ఫైన్లు వేశారు. గుర్తింపు రాకుండానే నిబంధనలకు విరుద్ధంగా ముందుస్తు అడ్మిషన్లు తీసుకున్న కాలేజీలపై, అడ్మిషన్ నోటిఫికేషన్ రాకముందే పేపర్లలో, బయట అడ్మిషన్లు ప్రారంభం అని ప్రచారం చేసిన కాలేజీలు, ఆలస్యంగా అఫిలియేషన్లు తీసుకున్న కాలేజీలపై, రిజిస్ట్రేషన్లు/ ఎన్ఆర్ రిజిస్ట్రేషన్లు లేటుగా చేసిన కాలేజీలకు ఫైన్లు భారీగానే ఫైన్లు వేశారు.
పర్మిషన్లలో స్పీడ్
జరిమానాల విషయంలో కఠినంగా ఉన్న బోర్డు.. అనుమతుల విషయంలోనూ వేగంగా పనిచేస్తున్నది. గతంలో వలె ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితికి చెక్ పెట్టి, అఫిలియేషన్ల ప్రక్రియను ఆన్లైన్లో సకాలంలోనే పూర్తి చేస్తోంది. గతేడాది 2024–-25 పర్మిషన్లు ఇవ్వడానికి 112 రోజులు (జనవరి దాకా) టైం తీసుకున్నారు. కానీ ఈసారి 2025–26లో ఆన్‌లైన్ విధానం, ఆఫీసర్ల పర్యవేక్షణతో కేవలం 30 నుంచి 40 రోజుల్లోనే ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. ఈ విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో 3,351 కాలేజీలకు అఫిలియేషన్లు మంజూరు చేశారు. గతేడాదితో పోలిస్తే ఇది త్వరగా పూర్తయింది. ఈ-–ఆఫీస్ విధానంతోనే ఇది సాధ్యమైందని ఆఫీసర్లు చెప్తున్నారు.
తనిఖీలతో వెలుగులోకి లోపాలు
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీలపై బోర్డు చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యంగా ఒకే కాంప్లెక్స్ లో కింద షాపులు, పైన కాలేజీలు నడిపే ‘మిక్స్డ్ ఆక్యుపెన్సీ’ కల్చర్ పై సీరియస్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటివి 176 కాలేజీలు ఉన్నట్లు గుర్తించారు. గతేడాది సర్కారు ‘లాస్ట్ ఛాన్స్’ కింద వదిలేసింది. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ‘ఎన్ఓసీ’ తేవాలని అల్టిమేటం జారీ చేసింది. మరోవైపు టాస్క్ ఫోర్స్ టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లో సడెన్ విజిట్స్ చేశాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలో జూన్, ఆగస్టు నెలల్లో చేసిన తనిఖీల్లో చాలా కాలేజీల్లో లోపాలు బయటపడ్డాయి. మొత్తం 150 కాలేజీలను తనిఖీ చేస్తే.. అందులో 113 కాలేజీల్లో ఏదో ఒక లోపం ఉన్నట్లు తేలింది. వీరందరికీ నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ సిటీలోని ఓ కార్పొరేట్ కాలేజీని నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ తీసుకున్న చోటు నుంచి.. వేరే ప్రాంతానికి మార్చారు. దీన్ని గుర్తించిన ఇంటర్ బోర్డు అధికారులు రూ.5 లక్షల ఫైన్ వేశారు. మేడ్చల్ జిల్లాలో గుర్తింపు ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో స్టూడెంట్ల అడ్మిషన్లు తీసుకొని..ఓ అకాడమీలో క్లాసులు చెప్పిస్తున్నారు. దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు ఆ కాలేజీకి భారీగానే ఫైన్ వేసింది.
రూల్స్ అమలు చేయాల్సిందే:
కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డు సెక్రటరీ ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు రావాలంటే తప్పకుండా ఇంటర్ బోర్డు నిబంధనలు అమలు చేయాల్సిందే. నిబంధనలు అమలు చేసేలా కాలేజీలకు పలు మార్లు సూచనలు చేశాం. రూల్స్ బ్రేక్ చేసిన కాలేజీలకు బోర్డు నిబంధనల ప్రకారం ఫైన్లు వేస్తున్నాం. ఫైన్ చెల్లించని కాలేజీలను బ్లాక్ లో పెడ్తున్నాం. అనుమతి లేకుండా క్లాసులు నడిపించే కాలేజీలు, అడ్మిషన్లు తీసుకునే కాలేజీలపై కఠినంగా వ్యవహరిస్తాం.
