- 145 అర్బన్ పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయనున్న ప్రభుత్వం
- వారానికి ఒకసారి అందుబాటులో 8 రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల డాక్టర్లతో స్పెషల్ ఓపీ సేవలు
- గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌పై తగ్గనున్న పేషెంట్ల భారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా బస్తీల్లో స్పెషలిస్ట్ వైద్యం అందించేందుకు నిర్ణయించింది. హెల్త్ మిషన్-–100లో భాగంగా అర్బన్ హెల్త్ సెంటర్ల రూపురేఖలు మార్చేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ సిటీలోని 145 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు (యూపీహెచ్‌సీ)ను పాలిక్లినిక్‌లుగా అప్ గ్రేడ్ చేయనుంది. ఈ మేరకు 100 రోజుల స్పెషల్ క్యాంపెయిన్‌లో భాగంగా నాలుగో ఫేజ్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ప్రస్తుతం బస్తీ దవాఖాన, అర్బన్ పీహెచ్‌సీలలో ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఇకపై గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉన్న145 పాలిక్లినిక్‌లలో స్పెషలిస్ట్ వైద్యుల సేవలు కూడా లభించనున్నాయి. అలాగే, వారానికి ఒకసారి ప్రత్యేకంగా ఓపీ కూడా నిర్వహిస్తారు. మొత్తం 8 రకాల వైద్య సేవలను ఇక్కడ అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దీనివల్ల గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఆప్తాల్మాలజీ, డెంటల్, ఆర్థోపెడిక్ వంటి డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన వైద్యం బస్తీల్లోనే అందనుంది. మే 16 నుంచి జూన్ 9 వరకు ఈ కస్టమైజ్డ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ కింద పాలిక్లినిక్‌లను ప్రారంభించి.. ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.
