కరెంటు చార్జీల పెంపునకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

కరెంటు చార్జీల పెంపునకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌
  • ‌అన్ని కేటగిరీలకు బాదుడే
  • నేడు ఈఆర్సీకి ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం ఆదేశం

రాష్ట్రంలో కరెంటు చార్జీల బాదుడుకు రంగం సిద్ధమైంది. డొమెస్టిక్‌ , కమర్షియల్‌ , ఇండస్ట్రియల్‌ కేటగిరీల చార్జీలు పెంచేం దుకు సర్కారు గ్రీన్‌‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. చార్జీల టారిఫ్‌ ను శనివారం విద్యుత్‌‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి అందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు సమాచారం. విద్యుత్‌‌ అధికారులతో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, ఎస్‌‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి , ఎన్‌‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌ రా వులతో సమావేశమయ్యారు . విద్యుత్‌‌ సంస్థలకు ప్రభుత్వం ఏటా ఇచ్చే సబ్సిడీని ఈ సారి రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ప్రజా ప్రయోజనాల కోసమే సాగు నీటి ప్రాజెక్టులను వాడుతున్నందున కాళేశ్వరం ప్రాజెక్టుకు వాడే విద్యుత్‌‌ టారిఫ్‌ పెంచకుండా పబ్లిక్‌ యుటిలిటీ కేటగిరీలో చూపించాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం. మిగతా కేటగిరీలకు చార్జీలు పెంచుకునేందుకు సీఎం అంగీకరించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసిన విద్యుత్‌‌ సంస్థలు.. శనివారం ఈఆర్సీకి సమర్పించనున్నాయి.