హైదరాబాద్, వెలుగు: స్కూళ్లలో సిలబస్ పూర్తి చేసే అంశంపై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై టీచర్లు తమ ఇష్టానుసారంగా పాఠాలను త్వరగా పూర్తి చేయడం గానీ, ఆలస్యం చేయడం గానీ కుదరదని స్పష్టం చేసింది. అకడమిక్ క్యాలెండర్‌లో నిర్దేశించిన గడువులోపే సిలబస్‌ను కంప్లీట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అనుసరించాల్సిన కొత్త మార్గదర్శకాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేశారు. కొన్ని బడుల్లో సిలబస్ ముందే పూర్తి చేయడం, లేదా ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యంపై ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు.
నాణ్యమైన బోధనే ముఖ్యం..
పాఠ్యపుస్తకాల్లో సూచించిన టైమ్ అలోకేషన్ ప్రకారమే ప్రతి చాప్టర్‌ను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ‘సిలబస్ అయిపోయింది’ అనిపించుకోవడానికి హడావుడిగా పాఠాలు చెప్పకూడదని, అలాగే గడువు దాటిన తర్వాత కూడా సాగదీయకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి పాఠం అర్థమయ్యేలా, నాణ్యమైన బోధన అందించడమే లక్ష్యంగా ఉండాలని సూచించారు. పాఠం చెప్పడమే కాదు, విద్యార్థులు ఆ పాఠం నుంచి ఏం నేర్చుకున్నారనే దానిపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు.
ప్రతి చాప్టర్ ముగియగానే విద్యార్థులకు అసెస్‌మెంట్లు, క్లాస్ యాక్టివిటీలు, రివిజన్ ఎక్సర్‌సైజులు నిర్వహించాలన్నారు. టీచర్లు తాము ప్రతిరోజూ బోధించిన పాఠాల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని, వీటిని ఎప్పటికప్పుడు తనిఖీ కోసం సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, హైస్కూల్ హెడ్ మాస్టర్లు సిలబస్ ఏ మేరకు పూర్తవుతుందో నిరంతరం పర్యవేక్షించాలని, రెగ్యులర్ స్టాఫ్ మీటింగ్స్ నిర్వహించాలని ఆదేశించారు.
వెనుకబడితే రెమెడియల్ క్లాసులు..
చదువులో వెనుకబడిన, పాఠాలు అర్థంకాని విద్యార్థుల కోసం విడిగా ‘రెమెడియల్’ క్లాసులు నిర్వహించాలని సూచించారు. కానీ ఇవి రెగ్యులర్ అకడమిక్ షెడ్యూల్‌కు ఆటంకం కలగకుండా చూడాలని వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు , హెచ్‌ఎంలు, టీచర్లు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించేలా చూడాలని డైరెక్టర్ ఆదేశించారు.
