హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 2025–-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 53 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్‌గా ప్రమోషన్లు ఇస్తూ ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ
ఆదిత్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 12న నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఆమోదించిన జాబితా ఆధారంగా అర్హులైన జూనియర్ లెక్చరర్లను ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 16న మధ్యాహ్నం 3 గంటలకు ఆయా జిల్లా ఇంటర్ విద్యాధికారుల ఆఫీసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఈ పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ‘సీనియారిటీ-కమ్-రోస్టర్’ విధానాన్ని అనుసరిస్తున్నారు. కౌన్సెలింగ్ సమయంలో సీనియారిటీ జాబితాలో ముందున్న అభ్యర్థులకు తమకు నచ్చిన జూనియర్ కాలేజీని ఎంపిక చేసుకునే తొలి అవకాశం కల్పించనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ముగిసిన వెంటనే డైరెక్టర్ ఆఫీస్నుంచి ఆన్‌లైన్‌లో పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయనున్నారు. ప్రమోషన్పొందిన వారు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోపు కొత్త బాధ్యతలు స్వీకరించాలని, లేనిపక్షంలో వారి పదోన్నతిని రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. పోస్టింగ్‌ల విషయంలో ఎలాంటి రాజకీయ లేదా ఇతర పైరవీలకు తావులేదని కూడా అధికారులు స్పష్టం చేశారు.
