తెలంగాణ కోసం త్యాగం చేసిన అందరికీ భూములు ఇలాగే ఇస్తారా: హైకోర్టు

తెలంగాణ కోసం త్యాగం చేసిన అందరికీ భూములు ఇలాగే ఇస్తారా: హైకోర్టు

దర్శకుడు శంకర్ కు భూమి కేటాయింపుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. రూ.2.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని  కేవలం రూ. 25 లక్షలకు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. శంకర్ కు భూమిని కేటాయించడంపై ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని  తెలిపిన అడ్వకేట్ జనరల్(ఏజీ)..సినిమా స్టూడియో నిర్మించడం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుందని తెలిపారు. దీనిపై రియాక్ట్ అయిన కోర్టు.. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలాది మందికి ఇలాగే భూమిని  ఇస్తారా అని ప్రశ్నించింది. అంతేకాదు ప్రభుత్వ భూములను  సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీళ్లేదన్న కోర్టు… ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా అని ప్రశ్నించింది. అయినా హైదరాబాదులో ఇప్పటికే అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా అంది. భూముల కేటాయింపుతో ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని.. కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలంది. ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం రెండు వారాల గడువు కోరడంతో…హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.