బాసర ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

బాసర ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

హైదరాబాద్/జూబ్లీహిల్స్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్టూడెంట్ల పేరెంట్స్ మండిపడ్డారు. క్యాంపస్ లోని సమస్యలను పరిష్కరించకపోతే స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇచ్చి, దాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలకు ఏమైనా జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ఆదివారం స్టూడెంట్ల పేరెంట్స్ ముట్టడించారు. పేరెంట్స్ విడతల వారీగా రాగా, వచ్చినోళ్లను వచ్చినట్టు పోలీసులు అరెస్టు చేశారు. చివరికి కొందరు ఇంటి వరకూ చేరుకొని ధర్నా చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రిని కలిసి వినతిపత్రం ఇస్తామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. సబిత ఇంట్లో లేరంటూ బలవంతంగా వారిని అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా పేరెంట్స్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకపోతే బాసరకు వెళ్లి ఆందోళన చేస్తామని, అవసరమైతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. తమను గూండాల్లాగా అరెస్టు చేసిన సర్కార్ కు తగిన బుద్ధి చెప్తామన్నారు.  

మంత్రికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలె...

స్టూడెంట్లకు షోకాజ్ నోటీసులు ఇస్తామని ఇన్ చార్జ్ వీసీ వెంకటరమణ హెచ్చరించడంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకొని ఇలా మాట్లాడారో చెప్పాలన్నారు. 45 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకూ పరిష్కరించని ఆమెకు ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, అంతకుముందు ఎల్బీనగర్ లో పేరెంట్స్ కమిటీ సమావేశం జరిగింది. తమ పిల్లలు చేస్తున్న ఆందోళనకు తాము పూర్తి మద్దతు ఇస్తామని పేరెంట్స్ ప్రకటించారు. సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తమ పిల్లలు తినకుండా ఆందోళన చేస్తున్నారని, తాము కూడా నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. 

హామీలు నెరవేరుస్తామని పేపర్​పై రాసివ్వాలె.. 

ఇటీవల ట్రిపుల్ ఐటీని సందర్శించిన మంత్రి సబిత ఆరు హామీలిచ్చి.. ఇప్పటి వరకు ఒక్కటన్నా నెరవేర్చలేదు. సమస్యలు పరిష్కరిస్తున్నట్టు పేపర్లలో ప్రకటనలు ఇస్తున్నారే తప్ప, పనులు మాత్రం చేయడం లేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి పేపర్ పై రాసివ్వాలి. మంత్రి వచ్చి పోయినంక కూడా క్యాంపస్ లో మంచి అన్నం పెడ్తలేరు. టాయిలెట్స్ లాంటి కనీస సౌలతులు కూడా లేవు. ఫుడ్ పాయిజనింగ్ అయిన విద్యార్థుల రిపోర్టులు ఇంకా రాలేదని ఇన్ చార్జ్ వీసీ అనడం హాస్యాస్పదంగా ఉంది. ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన సంజయ్ కిరణ్ కుటుంబానికి న్యాయం చేయాలి. 

- రాజేశ్వరి, అధ్యక్షురాలు, ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ కమిటీ