పల్లెల్లో పొంచి ఉన్న రోగాల ముప్పు

పల్లెల్లో పొంచి ఉన్న రోగాల ముప్పు
  • పల్లెల్లో ఎటు చూసినా బురదే..!
  • కంపుకొడుతున్న వీధులు

కామారెడ్డి, వెలుగు: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఊళ్లలో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. స్కూళ్లు, అంగన్‌‌‌‌వాడీ సెంటర్లు, ఇండ్ల మధ్యనే వర్షపు నీరు, మోరీ నీళ్లు రోజుల తరబడి నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని జనం భయపడుతున్నారు. అయితే జనావాసాల్లో వాన నీళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టడంలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కొద్ది రోజుల కింద పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి క్లీన్‌‌‌‌ చేశారు. ఆ తర్వాత గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అంతగా శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. దీంతో మళ్లీ పరిసరాలు యథావిధిగా తయారయ్యాయి.

పరిస్థితి ఇది...
జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ ఏరియాల్లోని చాలా ఊర్లలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్, లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట, తాడ్వాయి, రాజంపేట మండలాల్లోని అనేక ఊర్లలో పరిసరాలు క్లీన్‌‌‌‌గా లేవు.  మోరీల్లో చెత్త చెదారంతో పాటు, స్కూళ్లు, అంగన్‌‌‌‌వాడీ సెంటర్లు,  ప్రజల ఇండ్ల మధ్యనే రోజుల తరబడి మురుగు నిలిచి ఉంటోంది. దోమల నివారణకు ప్రతి పంచాయతీకి ఏడాది కిందట ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. దోమల వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఫాగింగ్‌‌‌‌ చేయడం లేదు. సీజనల్ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా హాస్పిటల్‌‌‌‌కు 500 నుంచి  600 వరకు ఓపీ వచ్చేది. వారం రోజులను ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. రెండు రోజు నుంచి 700 మంది ఓపీ రాగా ఇందులో  100 మంది వరకు జ్వరాలతో వస్తున్నవారే ఉన్నారు. బాన్స్​వాడ ఏరియా హాస్పిటల్, గాంధారి, ఎల్లారెడ్డి, మద్నూర్​సీహెచ్‌‌‌‌సీలతో పాటు పీహెచ్‌‌‌‌సీలకు కూడా జ్వర బాధితులు ప్రతి రోజు వస్తున్నారు.  వాతవరణంలో మార్పుతో పాటు  పరిసరాలు క్లీన్‌‌‌‌గా లేకపోవడంతోనే జ్వరాలు వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే పల్లెల్లో పరిసరాలు క్లీన్​ చేయించడంపై దృష్టి పెట్టాలని ఇటీవల కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా పనులు జరుగడం లేదని తెలుస్తోంది.   

ఇది పిట్లం మండలం తిమ్మానగర్‌‌‌‌‌‌‌‌ ప్రైమరీ స్కూల్. అంగన్‌‌‌‌వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌ చిన్నారులతో పాటు ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లు పొద్దంతా ఇక్కడే ఉంటారు. ఇటీవల కురిసిన  వర్షాలకు వరద, మోరీ నీళ్లు స్కూల్‌‌‌‌ ఆవరణలో వచ్చి చేరాయి. రోజుల తరబడి అవి అలాగే ఉండడంతో  దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో చిన్నారులకు సీజనల్‌‌‌‌ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పేరెంట్స్‌‌‌‌ ఆందోళన చెందుతున్నారు. స్కూల్ ఏరియాను క్లీన్‌‌‌‌ చేయించడంపై యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శులు వస్తున్నాయి.