వర్సిటీల కొత్త హద్దులు మారుస్తలే

వర్సిటీల కొత్త హద్దులు మారుస్తలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యూనివర్సిటీల హద్దుల మార్పులపై సర్కారు నాన్చుతోంది. రెండేండ్ల కిందనే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా, ఇప్పటికీ ఎటూ తేల్చలేదు. ముందుగా అన్ని యూనివర్సిటీల పరిధుల్లో మార్పులు చేయాలని భావించినా, టెక్నికల్ ప్రాబ్లమ్స్​తో కేవలం మూడు యూనివర్సిటీలకే దీన్ని పరిమితం చేసే ఆలోచనలో ఉన్నతాధికారులున్నారు. అయితే వర్సిటీల పరిధి మారాలంటే అసెంబ్లీలో చట్టాన్ని మార్చాలని ఆఫీసర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 11 స్టేట్ సర్కారు యూనివర్సిటీలున్నాయి. ఇదివరకు తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో ఇవి ఉండగా, విభజన నేపథ్యంలో వాటి స్వరూపం 33 జిల్లాలకు మారిపోయింది. వర్సిటీ హద్దులు మారకున్నా, జిల్లాలు మారిపోయాయి. దీంతో వర్సిటీలకు దూరంగా ఉన్న జిల్లాలను దగ్గరలోని యూనివర్సిటీకి అనుబంధంగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. సర్కారు ఆదేశాలతో అప్పటి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి నేతృత్వంలోని కమిటీ చేసిన ప్రతిపాదనలను అప్పట్లోనే సర్కారుకుఅందించారు. వర్సిటీల ఏర్పాటు సందర్భంలో చేసిన చట్టంలోని జిల్లాలకు అనుగుణంగా చేయాల్సి వస్తే, పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో వెంటనే కొన్ని యూనివర్సిటీల పరిధిని మార్చాలని నిర్ణయించారు. అయితే యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కో వర్సిటీ కింద కేవలం 200 కాలేజీలు మాత్రమే ఉండాలి. కానీ ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ పరిధిలో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే యూజీసీ పలుమార్లు తెలంగాణ సర్కారుకు ఈ విషయాన్ని తెలిపింది. అయినా సర్కారులో చలనం లేదు. 

ఉమ్మడి ఆదిలాబాద్ రెండు వర్సిటీల పరిధిలోకి.. 

ప్రస్తుతం కేవలం కాకతీయ(వరంగల్) యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను తీసేయాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఆదిలాబాద్‌‌, నిర్మల్‌‌ జిల్లాలను తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్) పరిధిలోకి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను శాతవాహన (కరీంనగర్) వర్సిటీ పరిధిలోకి మార్చాలని భావిస్తోంది. ముందుగా అనుకున్నట్టు జరిగితే పాలమూరు, మహాత్మా గాంధీ వర్సిటీల్లో మాత్రమే మార్పులుండవు. ఓయూ పరిధిలో 500లకు పైగా కాలేజీలుండగా, ముందుగా ఓయూ పరిధిని తగ్గించాలని అనుకున్నా, తర్వాత వెనక్కి తగ్గినట్టు తెలిసింది. మరోపక్క ఉమ్మడి మెదక్ పరిధిలో ఓ యూనివర్సిటీ పెట్టే ఆలోచన సర్కారులో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోనే ఇంకా ఓయూ పరిధిలోనే ఆ జిల్లాల కాలేజీలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. 

కొత్త జిల్లాలతో కొత్త చిక్కులు...

వర్సిటీ పరిధిలు మారిన నేపథ్యంలో జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు వేర్వేరు జిల్లాలకు వెళ్లాయి. దీంతో యూనివర్సిటీ పరిధులను ఎలా చేయాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఉదాహరణకు ఇదివరకు షాద్ నగర్ ఉమ్మడి మహబూబ్​నగర్​పరిధిలో ఉండేది. దీంతో అక్కడి కాలేజీలన్నీ పాలమూరు వర్సిటీలో కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాల మార్పుతో షాద్​నగర్ ఏరియా రంగారెడ్డి జిల్లాకు మారింది. రంగారెడ్డి జిల్లా ఓయూ పరిధిలో ఉంది. దీంతో షాద్​నగర్​ కాలేజీలను పాలమూరులో కొనసాగించాలా.. ఓయూకి మార్చాలా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతానికి షాద్ నగర్ పాలమూరు వర్సిటీ పరిధిలోనే కొనసాగుతోంది. ఇలా ఉమ్మడి జిల్లా సరిహద్దులు మారిన పలు ప్రాంతాల్లోని కాలేజీలను ఏ వర్సిటీ పరిధి అనే అంశంపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు చర్చిస్తున్నారు. ఏది మార్చినా అసెంబ్లీలో యూనివర్సిటీ యాక్ట్​ను మార్చాలని సర్కారు పెద్దలు పేర్కొంటున్నారు. ‘‘ముందుగా అన్ని యూనివర్సిటీల పరిధుల్లో మార్పులు చేయాలని భావించినం. ప్రస్తుతం బాగా ఇబ్బంది ఉన్న చోటనే మార్పులు చేయాలనుకుంటున్నాం. కేవలం కాకతీయ, తెలంగాణ, శాతవాహన పరిధులు మాత్రమే మార్చాలనే యోచనలో ఉన్నాం. సర్కారుకు ప్రతిపాదనలు ఇచ్చినం. సర్కారు నుంచి ఆదేశాలు రాగానే దాన్ని అమలు చేస్తం..” అని ఉన్నత విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు.