
- ఈ-శ్రమ్‌పై సర్కారు నిర్లక్ష్యం
- ప్రచారం, క్యాంపులు, అవగాహనపై స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: అసంఘటిత కార్మికుల కోసం అమలులో ఉన్న ఈ–శ్రమ్ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. క్యాంపెయిన్లు ఏర్పాటు చేసి, ప్రచారం చేసి కార్మికులకు అవగాహన కల్పించాల్సిన సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో రాష్ట్రంలోని లక్షల మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలకు దూరమవుతున్నారు. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు కూడా చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డు ఫర్ అన్‌ఆర్గనైజ్డ్ వర్కర్స్ నిధుల్లేక నిరుపయోగంగా మారింది.
కోటి మందిలో 5 లక్షల మంది మాత్రమే..
అన్‌ఆర్గనైజ్డ్ వర్కర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ స్కీం ప్రవేశపెట్టింది. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను సేకరించడానికి కార్మిక మంత్రిత్వ శాఖ ఈ–శ్రమ్ పోర్టల్‌ను రూపొందించింది. ఈ పోర్టల్‌లో తమ వివరాలతో ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న కార్మికులకు కార్డు వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వీరికి అందుతాయి. రిజిస్టర్ అయిన కార్మికుడు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే.. కార్మికుడి కుటుంబానికి రూ.2 లక్షలు, దివ్యాంగుడైతే రూ.లక్ష పరిహారాన్ని ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద చెల్లిస్తారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది అసంఘటిత కార్మికులు ఉంటారు. ఈ–శ్రమ్ పోర్టల్ ఏర్పాటు చేసి నెలన్నర గడుస్తున్నా కేవలం 5 లక్షల మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. వీటిలో ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్లను స్వచ్ఛంద సంస్థలే చేశాయి. మన రాష్ట్రాన్ని మినహాయిస్తే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో అసంఘటిత కార్మికుల వివరాలతో ఈ–శ్రమ్ పోర్టల్‌లో ఎక్కువ సంఖ్యలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్ధితులు కనిపించడం లేదు. ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించని ప్రతి కార్మికుడు అసంఘటిత రంగం పరిధిలోకే వస్తారు.
ఉత్తగనే ‘అన్‌ఆర్గనైజ్డ్ బోర్డు’..
తెలంగాణ స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ ఫర్ అన్‌ఆర్గనైజ్డ్ వర్కర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల చైర్మన్‌ను కూడా నియమించింది. అయితే, బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా ఈ బోర్డుకు కేటాయించలేదు. దీంతో ఏ పనీ చేసే పరిస్థితులు లేక బోర్డు ఉద్యోగులంతా ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి. నిధులు లేకపోవడంతో ఏ పనులు చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ ఇట్ల..
పోర్టల్‌లో నమోదు చేసుకోవాలనుకునే వారు ఈ–శ్రమ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. కామన్ సర్వీస్ సెంటర్లు, రాష్ట్ర సేవా కేంద్ర, లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్లు, గుర్తించిన పోస్టాఫీసులు, డిజిటల్ సేవా కేంద్రాలకు వెళ్లి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి దేశంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యే డిజిటల్ ఈ–శ్రమ్ కార్డు ఇస్తారు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి వివరాలను అప్‌డేట్ కూడా చేసుకోవచ్చు.
సర్కారు పట్టించుకోవాలె..
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ–శ్రమ్ పోర్టల్‌లో రాష్ట్రం నుంచి ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేసుకోలేదు. కార్మికులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాం. అయినా రాష్ట్ర సర్కారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడంలేదు. స్వచ్ఛంద సంస్థల సాయంతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాం. అందరూ ఎన్రోల్ చేసుకునేలా సర్కారు చొరవ చూపాలి. కేంద్ర ప్రభుత్వం కూడా పోర్టల్‌లో కొన్ని మార్పులు చేయాలి.
- షేక్ సలావుద్దీన్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్, ఫౌండర్ ప్రెసిడెంట్