- 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్
- ప్రతి కాలేజీలో ప్రత్యేకంగా
- 10 బెడ్లు, వైద్య నిపుణులు
- ఎర్రగడ్డ ఐఎంహెచ్ కు పెరుగుతున్న ఆల్కహాల్, గంజాయి బాధితులు
- ఒక్క ఫిబ్రవరిలోనే
- 677 మందికి ట్రీట్మెంట్
- సిటీపై భారం తగ్గించేందుకు హబ్ అండ్ స్పోక్ విధానం
హైదరాబాద్, వెలుగు: మత్తు బాధితులు చికిత్స కోసం ఇక హైదరాబాద్ దాకా రావాల్సిన పనిలేదు. జిల్లాల్లోనే డీఅడిక్షన్సెంటర్లు ఏర్పాటు చేసి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్ కు బానిసైన వారికి దగ్గరలోనే ట్రీట్మెంట్ ఇచ్చేలా రాష్ట్రంలోని 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రత్యేకంగా డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ హాస్పిటల్ (ఐఎంహెచ్) ఒక్కటే ఉండటంతో.. అక్కడ రద్దీ విపరీతంగా పెరిగింది. జిల్లాల నుంచి వస్తున్న బాధితులతో హాస్పిటల్ కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లోనే వారికి వైద్యం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎర్రగడ్డపై పెరుగుతున్న ఒత్తిడి..
రాష్ట్రం మొత్తానికి మానసిక ఆరోగ్య చికిత్స, మత్తు విముక్తికి ఎర్రగడ్డ హాస్పిటలే దిక్కైంది. దీంతో అక్కడ పేషెంట్ల తాకిడి పెరిగింది. గత డిసెంబర్ లో 620 కేసులు రాగా.. జనవరిలో ఆ సంఖ్య 700 దాటింది. ఇక ఫిబ్రవరిలో ఏకంగా 677 మంది ఓపీకి వచ్చారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వీరిలో కొత్తగా వచ్చినవారే 237 మంది ఉన్నారు.
ఫిబ్రవరిలో వచ్చిన వారిలో 232 మంది ఆల్కహాల్ కు బానిసైన వారే. ఆ తర్వాత నికోటిన్ (సిగరెట్, గుట్కా) బాధితులు 217 మంది, గంజాయి తాగేవారు 29 మంది ఉన్నారు. నిద్రమాత్రలకు అలవాటు పడినవారు 10 మంది రాగా, ఎండీఎంఏ 2, ఎల్ఎస్‌డీ 1, ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ తీసుకునే ఒకరు చికిత్స కోసం వచ్చారు.
ప్రతి సెంటర్ లో పది బెడ్లు..
ప్రతి మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసే డీ-అడిక్షన్ సెంటర్ లో కనీసం 10 బెడ్లతో ఒక వార్డును ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒక సైకియాట్రిస్ట్, మెడికల్ ఆఫీసర్, కౌన్సిలర్, స్టాఫ్ నర్స్ నిరంతరం అందుబాటులో ఉంటారు. పేషెంట్ కండిషన్ బట్టి 7 నుంచి 10 రోజులు అడ్మిట్ చేసుకుంటారు. అక్కడే డీటాక్సిఫికేషన్, డీ-అడిక్షన్ చికిత్సలు, కౌన్సెలింగ్ ఇస్తారు.
డీ-అడిక్షన్ సెంటర్ వ్యవస్థ హబ్ అండ్ స్పోక్ పద్ధతిలో పనిచేయనుంది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఐఎంహెచ్ ప్రధాన కేంద్రంగా ఇక్కడి నిపుణులు జిల్లాల్లోని డాక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చి సలహాలు, సూచనలు చేస్తారు. జిల్లాల్లోని 36 మెడికల్ కాలేజీలు స్పోక్స్ గా వ్యవహరిస్తాయి. పరిస్థితి మరీ సీరియస్ గా ఉంటే తప్ప హైదరాబాద్ కు రిఫర్ చేయరు.
సిటీకి రావాల్సిన పని తప్పుతుంది..
ప్రస్తుతం ఎర్రగడ్డ హాస్పిటల్కు వచ్చే పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. జిల్లాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి వస్తున్నారు. జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే తమపై ఒత్తిడి తగ్గుతుంది. బాధితులకు వారి సొంత జిల్లాలోనే త్వరగా వైద్యం అందుతుంది. కేవలం క్లిష్టమైన కేసులను మాత్రమే ఇక్కడికి రిఫర్ చేస్తే సరిపోతుంది.
- డాక్టర్ అనిత రాయిరాల, సూపరింటెండెంట్, ఐఎంహెచ్, ఎర్రగడ్డ
