న్యూఢిల్లీ: అప్పుల్లో ఉన్న టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియాకు (వీఐ) కేంద్రం భారీ ఊరటనిచ్చింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలను ప్రభుత్వం 27 శాతం మేర, అంటే రూ.23,649 కోట్లు తగ్గించింది. దీనివల్ల గతంలో రూ.87,695 కోట్లుగా ఉన్న బకాయిలు రూ.64,046 కోట్లకు తగ్గాయి. ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఐదేళ్ల మారటోరియం విధించింది.
టెలికాం శాఖ కమిటీ బకాయిలను మరోసారి సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుంది. 2031–2032 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ చెల్లింపులు ప్రారంభం అవుతాయి. వీఐ మొదటి నాలుగేళ్లు ఏటా కనీసం రూ.100 కోట్లు చెల్లించాలి. మిగిలిన బకాయిలను ఆరు సమాన వార్షిక వాయిదాల్లో కట్టాలి. 2018, 2019 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.124 కోట్ల బకాయిలను మాత్రం 2026 మార్చి నుంచి 2031 మార్చి లోపు చెల్లించాలి.

