- యువతకు ఉపాధి కల్పిస్తాం: జూపల్లి
- పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: పతంగుల పండుగకు శతాబ్దాల చరిత్ర ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ కోసమే ప్రభుత్వం ఇలాంటి వేడుకలు నిర్వహిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక రంగం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 7వ ‘ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్’ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన కైట్ ప్లేయర్స్ ఎగురవేస్తున్న రంగురంగుల పతంగులు ఆకాశాన్ని మురిపిస్తున్నాయన్నారు.
తన చిన్నతనంలో పతంగులు ఎగురవేసిన జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లోనే గాలిపటాల తయారీని ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు తమ బిజీ జీవితంలో కనీసం నెలకు రెండు రోజులైనా పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని, దీనివల్ల మానసిక ఉల్లాసం పొందడంతోపాటు స్థానిక కళాకారులకు, వ్యాపారులకు ఆర్థికంగా చేయూత ఇచ్చినట్టు అవుతుందని మంత్రి సూచించారు.
మూడు రోజులపాటు జరిగే ఈ కైట్ ఫెస్టివల్‌ను ప్రజలందరూ సందర్శించి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల మిఠాయిల స్టాళ్లను సందర్శించి, రుచులను ఆస్వాదించారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ఎండీ క్రాంతి వల్లూరి, భాషా, సాంస్కృతికశాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహ రెడ్డి, హెరిటేజ్ డైరెక్టర్ అర్జున్ రావు, కైట్ ఫెస్టివల్ కన్సల్టెంట్ పవన్ డి. సోలంకి, క్లిక్ ప్రతినిధులు లింబీ బెంజిమన్, పరమానందశర్మ, అభిజిత్ పాల్గొన్నారు.
ఆతిథ్యానికి మారుపేరు హైదరాబాద్: పొన్నం ప్రభాకర్
తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా మూడు రోజులపాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించడం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. హైదరాబాద్ నగరం ఆతిథ్యానికి మారుపేరు అని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్ కు వచ్చేందుకు మెట్రో సౌకర్యం ఉందని, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి కైట్ ఫెస్టివల్ ను వీక్షించవచ్చన్నారు. ప్రజలందరికీ ఆయన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
