ఈ వారంలో 2017 పీఆర్సీ ఇవ్వనున్న సర్కారు

ఈ వారంలో 2017 పీఆర్సీ ఇవ్వనున్న సర్కారు
  • 30 శాతం ఫిట్ మెంట్ ఇస్తే రూ.600 కోట్లు భారం
  • ఇప్పటికే సీసీఎస్ కు రూ.900 కోట్లు బాకీ ఉన్న ఆర్టీసీ
  • ప్రభుత్వం ఇయ్యకపోతే పీఆర్సీ భారం భరించడం కష్టమే 
  • 2013 పీఆర్సీ బకాయిలే ఇంకా రూ.280 కోట్లు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు 2017 పీఆర్సీని ప్రకటించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇటీవల మంత్రి హరీశ్​రావును ఆర్టీసీ యూనియన్లు కలిసిన టైమ్ లో పీఆర్సీ ప్రాసెస్​ స్టార్ట్ చేశామనే సంకేతాలిచ్చారు. మునుగోడులో ఆర్టీసీ కార్మికులు సుమారు 7 వేల మంది ఉన్నారు. ఆ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేసింది. ఆర్టీసీలో పీఆర్సీ ప్రకటనకు అనుమతివ్వాలని ఈసీకి లేఖ రాసింది. అందుకు ఈసీ నిరాకరించింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పూర్తి కావడం, మునుగోడులో టీఆర్​ఎస్​ గెలవడంతో పీఆర్సీని ప్రకటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

ఇప్పటికే అప్పులు.. పీఆర్సీ భారం ఎవరిపై?

ఆర్టీసీ కార్మికులు 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరుతుండగా దీనికి సుమారు రూ.600 కోట్లు అవసరమని అధికారుల అంచనా. అయితే అంత భారం భరించే స్థితిలో ఆర్టీసీ లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. పీఆర్సీ భారాన్ని ప్రభుత్వం పంచుకుంటుందా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 2013 పీఆర్సీకి సంబంధించి 50 శాతం బాండ్స్ నగదు ఇంకా చెల్లించలేదు. వీటికి రూ.280 కోట్లు అవసరమని అధికారులు అంటున్నారు. ఇప్పటికే సీసీఎస్​కు ఆర్టీసీ రూ.900 కోట్లు బకాయి పడింది. ఎన్నికల ముందు ప్రకటించిన మూడు డీఏలు, సకల జనుల సమ్మె కాలం జీతం అన్ని రూ.100 కోట్ల భారం పడింది. ప్రతి నెల జీతాలకే ఇబ్బంది అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆర్టీసీకి ఉన్న రూ.2,353 కోట్ల అప్పునకు ప్రతి నెలా రూ.21 కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తోంది. రిటైర్డ్​కార్మికులకు నిధుల కొరత కారణంగా బెనిఫిట్స్ ఇవ్వడం లేదు.  ఇప్పుడిప్పుడే ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 68 శాతం ఓఆర్ నిండుతోంది. ప్రతి రోజు రూ.13.5 కోట్ల రెవెన్యూ వస్తోంది.