దారికి రాకుంటే.. క్రిమినల్ చర్యలే!..కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ప్రభుత్వం సీరియస్

దారికి రాకుంటే.. క్రిమినల్ చర్యలే!..కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ప్రభుత్వం సీరియస్
  • ఇప్పటికే మేడిగడ్డ రిపేర్లపై సీఈకి సర్కారు లేఖ
  • తాజాగా అన్నారం, సుందిళ్లపై ఈఎన్​సీ లెటర్
  • ఖర్చులన్నీ సంస్థల నుంచే వసూలు చేయాలని ఆదేశం
  • సంస్థలు స్పందించకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న
  • బ్యారేజీలు డీఎల్పీలో ఉండగానే దెబ్బతిన్నాయని వెల్లడి
  • తాజాగా అన్నారం, సుందిళ్లపై ఈఎన్​సీ లెటర్
  • ఖర్చులన్నీ సంస్థల నుంచే వసూలు చేయాలని ఆదేశం
  • సంస్థలు స్పందించకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న
  • బ్యారేజీలు డీఎల్​పీలో ఉండగానే దెబ్బతిన్నాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ఏజెన్సీలు దారికి రాకుంటే.. క్రిమినల్​ చర్యలకే ప్రభుత్వం మొగ్గు చూపనున్నది. ఎల్​ అండ్​ టీతో పాటు మిగతా రెండు సంస్థలు ఆఫ్కాన్స్​, నవయుగలు కూడా రిపేర్లు చేయించేందుకు ససేమిరా అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలతో తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లను ఆ సంస్థతోనే చేయించాలని, ఆ సంస్థ నుంచే డబ్బులు వసూలు చేయాలని ఇప్పటికే సంబంధిత సీఈకి ప్రభుత్వం లేఖ రాసింది. 

తాజాగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన రిపేర్లపైనా రామగుండం సీఈకి ఈఎన్​సీ లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిపేర్ల ఖర్చులను నవయుగ (సుందిళ్ల), ఆఫ్కాన్స్​ విజేత (అన్నారం) సంస్థలే భరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. బ్యారేజీలు డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​(డీఎల్​పీ) లో ఉన్నప్పుడే దెబ్బతిన్నాయని, అయినా కూడా ఆయా సంస్థలు రిపేర్లు చేయించలేదని లేఖలో పేర్కొన్నారు. రిపేర్లు చేయాలని పదేపదే చెబుతున్నా సంస్థలు పట్టించుకోవడం లేదని, అయినా కూడా ఆ సంస్థలపై ఇప్పటివరకు చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలని రామగుండం సీఈకి ఈఎన్​సీ ప్రశ్నించారు. 

అదే సమయంలో బ్యారేజీల వద్ద టెస్టులు, డిజైన్లు, రిపేర్ల పనులన్నీ ఏజెన్సీల ఖర్చుతోనే వీలైనంత వేగంగా చేయాలని, ఇదే విషయాన్ని సంస్థలకు తేల్చి చెప్పాలని స్పష్టం చేశారు. అప్పుడు చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పనులు చేసేలా కఠినంగా వ్యవహరించాలని రామగుండం సీఈకి సూచించారు. నేషనల్​ డ్యామ్ ​ సేఫ్టీ అథారిటీ తుది నివేదికకు అనుగుణంగా రిపేర్లు చేయించాలన్నారు. అంతేకాకుండా ఇప్పటిదాకా బ్యారేజీల రిపేర్లకు ప్రభుత్వం పెట్టిన ఖర్చులనూ ఆయా సంస్థల నుంచే వసూలు చేయాలని పేర్కొన్నారు.

అగ్రిమెంట్​ ప్రకారం పనులు పూర్తి చెయ్యలే 

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులను అగ్రిమెంట్​ ప్రకారం పూర్తి చెయ్యలేదని లేఖలో ఈఎన్​సీ పేర్కొన్నారు. అగ్రిమెంట్​ ప్రకారం అన్నారం బ్యారేజీ 2018 ఆగస్టు 25, సుందిళ్ల బ్యారేజీ 2018 జులై 14 నాటికి పూర్తి కావాల్సి ఉందని.. కానీ, సుందిళ్ల బ్యారేజీ పనుల పూర్తికి కాంట్రాక్టును  2021 డిసెంబర్​ 31 వరకు పొడిగించారన్నారు. 2021 డిసెంబర్​ 21న నవయుగకు కంప్లీషన్​ సర్టిఫికెట్​ ఇస్తే.. ఆ తర్వాత రెండేండ్ల పాటు అంటే 2023 డిసెంబర్ 1 వరకు డీఎల్​పీ​ ఉంటుందన్నారు. 

అదే సమయంలో అన్నారం బ్యారేజీకి 2020 ఫిబ్రవరి 25 వరకు గడువు పొడిగించారన్నారు. కానీ, అంతకన్నా ముందే 2019 డిసెంబర్​ 16నే కంప్లీషన్​ సర్టిఫికెట్​ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆ లెక్కన చూసుకున్నా ఆ సంస్థ డీఎల్​పీ 2021 డిసెంబర్​ 15 వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రెండు బ్యారేజీల విషయాల్లో డీఎల్​పీ ముగిసే నాటికే తొలిసారి 2019లో వచ్చిన వరదలకే బ్యారేజీలు దెబ్బతిన్నాయని, అంటే అప్పటికీ అవి డీఎల్​పీలోనే ఉన్నట్లేనని స్పష్టం చేశారు. 

మొదట్లోనే రిపేర్లు చేసి ఉంటే..

2019లో వచ్చిన తొలి వరదలకే సుందిళ్ల బ్యారేజీ సీసీ బ్లాకులు, లాంచింగ్​ ఆప్రాన్లు దెబ్బతిన్నాయని, 2020 వరదలకు 46, 52వ గేట్ల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయని ఈఎన్​సీ గుర్తు చేశారు. ఇక 2022 వరదలకు కుడివైపు గైడ్​బండ్​ మీద ఉన్న కుడి, ఎడమ అప్రోచ్​ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. 2023 జులైలో బ్యారేజీకి దిగువన 33, 50వ నంబర్​ గేట్ల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. వాటికి సంబంధించి 2020 మే 23నే తొలి నోటీసులిచ్చారని, ఆ తర్వాత 2022లో రెండుసార్లు, 2023లో ఆరుసార్లు, 2025లో ఒకసారి నోటీసు ఇచ్చినా సంస్థ స్పందించదలేదని వివరించారు.

 ఇటు అన్నారం బ్యారేజీకి కూడా 2019లోనే మొదటి దెబ్బ తగిలిందన్నారు. 2020 వరదలకు వేరింగ్​ కోట్​, 35, 44  గేట్ల వద్ద లీకేజీలు, 2021 జనవరిలో 38, 28 గేట్ల వద్ద లీకేజీలు, 2024 జనవరిలో 35 గేట్​ వద్ద లీకేజీలు ఏర్పడ్డాయన్నారు. ఆ సంస్థకూ తొలిసారి 2020లోనే నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. తర్వాత 2021లో రెండుసార్లు, 2022లో ఒకసారి, 2023లో మరోసారి, 2024లో రెండుసార్లు, 2025లో ఐదుసార్లు నోటీసులిచ్చినా సంస్థ నుంచి స్పందన రాలేదన్నారు. 

డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​లో ఉన్నప్పుడే బ్యారేజీలకు భారీ నష్టం జరిగింది కాబట్టి రిపేర్ల ఖర్చులను సంస్థల నుంచే వసూలు చేయాలని తేల్చి చెప్పారు. కంప్లీషన్​ సర్టిఫికెట్​ ఇచ్చినంత మాత్రాన సంస్థలు తప్పించుకోలేవన్నారు.