వేములవాడ, వెలుగు: వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ ఎన్నికలపై కౌన్సిలర్అభ్యర్థులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ ఓడిపోతున్నారని తెలిసి గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూశారన్నారు.
ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి రాని వారికి తప్పకుండా అండగా ఉంటానన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేస్తూ ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించారన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. గత పాలకులు వేములవాడ పట్టణంలో ప్రతి వార్డులో సమస్యలను గాలికి వదిలేశారని, వేగంగా అభివృద్ధి చెందుతున్న వేములవాడను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేశ్, కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
