వేములవాడ/చందుర్తి, వెలుగు: పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో 14, 19 వార్డుల్లో, రుద్రంగి మండలకేంద్రంలో పూర్తియిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు కొత్త బట్టలు పెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ పుల్కం రాజు, వైస్ చైర్‌పర్సన్ నరాల శేఖర్, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చిలకల తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ, వేములవాడ ఏఎంసీ వైస్ చైర్మన్ రాకేశ్, కౌన్సిలర్లు కొండా శేఖర్, లీడర్లు చిలుక రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న
కోరుట్ల, వెలుగు: పోరాట యోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తాండ్రియాల గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న మూడు వీవో బిల్డింగ్‌లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నల సంక్షేమం కోసం పాటుపడుతోందని, కాటమయ్య రక్షణ కవచం పేరిట సేఫ్టీ కిట్లను పంపిణీ చేసిందన్నారు. కథలాపూర్ మండలం వరద ప్రదాయిని కలికోట సూరమ్మ చెరువు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. స్వయం సహాయక వ్యాపారాల ప్రారంభానికి ఆర్థిక సాయం అందిస్తూ మహిళలను ప్రోత్సహిస్తోందన్నారు.
