అగ్రికల్చరల్ కాలేజీ వ్యవసాయానికి వెన్నుదన్ను: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

 అగ్రికల్చరల్ కాలేజీ వ్యవసాయానికి వెన్నుదన్ను: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  •  
  • హుజూర్‌‌నగర్ మగ్దుంనగర్‌‌లో రూ. 123 కోట్లతో ఏర్పాటు చేయనున్న అగ్రికల్చర్ కాలేజీకి శంకుస్థాపన 
  • సైన్యంలో పైలెట్...రాజకీయాలలో ఫైటర్
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశంసించిన గవర్నర్ 

సూర్యాపేట, వెలుగు: హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నెలకొల్పనున్న అగ్రికల్చరల్ కాలేజీ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవనుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.  వ్యవసాయ అభివృద్ధికి ఈ కాలేజీ వరం లాంటిదని ఆశాభావం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉన్న మగ్దూంనగర్ లో రూ.123 కోట్లతో ఏర్పాటు చేయనున్న అగ్రికల్చర్ కాలేజీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో శంకుస్థాపన చేశారు.

దీంతో పాటు కోదాడ నియోజకవర్గ కేంద్రంలో నెలకొల్పనున్న జవహర్ నవోదయ విద్యాలయం, మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో  వసతి గృహం, వంటశాలకు భూమి పూజ చేశారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జై వీర్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.  

పరిశోధనలకు విజ్ఞానానికి వ్యవసాయంతో అవినాభావ సంబంధం.. 

అనంతరం జరిగిన సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ..  పరిశోధనలకు, విజ్ఞానానికి వ్యవసాయంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. అలాంటి కాలేజీని వ్యవసాయాధారిత ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.  వ్యవసాయాధారిత దేశంలో అగ్రికల్చర్ కాలేజీ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కాలేజీ శంకుస్థాపన వసంతపంచమి రోజున జరుపుకోవడం ఆనందకరమన్నారు. అత్యంత ప్రాశస్త్యం కలిగిన మట్టపల్లి లక్ష్మినరసింహా స్వామిని దర్శించుకోవడం భగవత్ సంకల్పమేనన్నారు.  దీనికి  అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో పాటు కృష్ణా నదిని చూడడం గొప్ప అనుభూతిని కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు.  సైన్యంలో చేరి పైలెట్ గా రాణించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాలలో చేరి అభివృద్ధి కోసం ఫైటర్ గా మారాడని గవర్నర్ కొనియాడారు. 

ధాన్యం దిగుబడిలో మనమే సాటి

హుజూర్ నగర్  నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయ కాలేజీని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో  నిలబడిందన్నారు. దిగుబడితో పాటు కొనుగోలులోనూ తెలంగాణా రికార్డ్ లను సృష్టించిందన్నారు.  తాజాగా ఖరీఫ్ సీజన్ లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ప్రభుత్వం 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం దేశ చరిత్రలోనే అరుదైన రికార్డ్ గా అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు అందించే బోనస్ తో కలిపి  రూ.19 వేల కోట్ల మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తోందన్నారు.  రూ.50 కోట్లతో కోదాడలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుతో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, స్టూడెంట్ల జీవితాల్లో వెలుగులు నిండతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్యవసాయ రంగానిదే భవిష్యత్  - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  

రానున్న రోజుల్లో ఐటీ, ఏఐ కన్నా వ్యవసాయ రంగమే ముందుంటుందని, సాఫ్ట్ వేర్, ఐటీ సెక్టార్ల నుండి వచ్చి వ్యవసాయ రంగంలో పనిచేసే రోజులు వస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వర అన్నారు. తెలంగాణ దేశానికే వరి అందించే ఏకైక రాష్ట్రంగా మారిందని, వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా వ్యవసాయ కాలేజీలు లేని ఉమ్మడి జిల్లాల్లో  వ్యవసాయ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  ఇందులో భాగంగానే నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో  వ్యవసాయ కాలేజీలు  మంజూరు చేశామన్నారు.  2.50 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి తెలంగాణ రైతులు దేశంలోనే ముందున్నారన్నారు. 

ఇతర పంటల విషయంలో సైతం రాష్ట్ర రైతులు ముందు నిలుస్తున్నారన్నారు.  ప్రత్యేకించి ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ముందు ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం పామాయిల్ పంటలో దేశంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని, ప్రస్తుతం 10 లక్షల ఎకరాలలో పామాయిల్ తోటలు పండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా సన్నబియ్యాన్ని సాగు చేయడంతో పాటు, పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న ఘనత తమదేనన్నారు. కార్యక్రమంలో   జిల్లా ఇంచార్జ్ మంత్రి ,రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ అల్తాఫ్ జానయ్య, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జై వీర్ రెడ్డి, పద్మావతి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా, గోదావరి జలాలు ఒక్క చుక్కను వదులుకోం 

మట్టపల్లి లక్ష్మి నరసింహస్వామి సాక్షిగా కృష్ణా ,గోదావరి జిల్లాలో ఒక చుక్క నీటిని కూడా వదులుకోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల హక్కులు కాపాడుకునేందుకు ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యాన్ని పండిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 85శాతం మందికి  ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు.

మట్టపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. హుజూర్‌‌నగర్, కోదాడ  ప్రజల జీవితాల్లో వెలుగులు  నింపడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా  రూ.150 కోట్లతో వ్యవసాయ కళాశాల, రూ.50 కోట్లతో కోదాడ సమీపంలో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషమన్నారు.