రాష్ట్ర ప్రగతి గురించి గవర్నర్​ అద్భుతంగా చెప్పారు : ఎమ్మెల్సీ కవిత

రాష్ట్ర ప్రగతి గురించి గవర్నర్​ అద్భుతంగా చెప్పారు :  ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్,  వెలుగు:  కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా,  ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నా రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సర్కారును అడుగడుగునా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. శనివారం  శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. మన రాష్ట్రం సాధించిన ప్రగతిని గవర్నర్​ తన ప్రసంగంలో చాలా అద్భుతంగా చెప్పారన్నారు.  ఇటీవల ఖమ్మంలో జరిగిన సభకు హాజరైన సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్ సింగ్ మాన్  (పంజాబ్) తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘కంటి వెలుగు’ పథకాన్ని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించారన్నారు.ఇది తెలంగాణ రాష్ట్రానికి, సీఎం కేసీఆర్ కు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కౌన్సిల్ లోనూ ఏర్పాటు చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన ఆయన అందుకు అంగీకరించారు. దేశానికే తెలంగాణ అభివృద్ధి సూచికగా నిలిచిందని గవర్నర్​ తన  ప్రసంగంలో చెప్పడం చాలా సంతోషించే విషయమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డి అన్నారు.  విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు ఆలివేలు నర్సిరెడ్డి, జనార్దన్​ రెడ్డి సూచించారు. 

గొర్రెలు మేపేందుకు స్థలం లేదు : ఎగ్గె మల్లేశం

సాగునీరు, 24 గంటల కరెంట్​లభ్యత కారణంగా  రైతులు వారికున్న మొత్తం భూముల్లో పంటలు వేస్తున్నారని, దీంతో గొర్రెలకు మేత దొరకని పరిస్థితి ఏర్పడిందని  ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో గొర్రెలను మేపుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎంను కోరనున్నట్లు పేర్కొన్నారు. 

పండిట్​లు, పీఈటీలకు ప్రభుత్వం న్యాయం చేస్తది

లాంగ్వేజీ పండిట్​లు, పీఈటీల ప్రమోషన్లకు అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సమస్యను మరోసారి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోతామని, తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. శనివారం ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లో పండిట్, పీఈటీ జేఏసీ నేతలు జగదీశ్, రాఘవరెడ్డి, నర్సింలు, గౌరీశంకర్, కృష్ణమూర్తి తదితరులు కలిశారు.