ఎన్నికల ఏడాదిలో బీఆర్ఎస్ కు తలనొప్పిగా నేతల తిరుగుబాట్లు

ఎన్నికల ఏడాదిలో బీఆర్ఎస్ కు తలనొప్పిగా నేతల తిరుగుబాట్లు

హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల కథ మళ్లా మొదటికి వచ్చింది. మేయర్లపై, మున్సిపల్​చైర్మన్​లపై అవిశ్వాసం పెట్టేందుకు గడువును మూడేండ్ల నుంచి నాలుగేండ్లకు పెంచుతూ గతంలోనే అసెంబ్లీలో బిల్లును పాస్ చేసిన ప్రభుత్వం దానిని గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే, నెలల తరబడి రాజ్​భవన్​లో పెండింగ్​లో ఉన్న ఈ బిల్లుపై గవర్నర్ కొన్ని సందేహాలు లేవనెత్తుతూ ఇటీవల ప్రభుత్వానికి తిప్పిపంపారు. ప్రభుత్వం వాటిపై క్లారిటీ ఇచ్చి మళ్లీ గవర్నర్​ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలతో గవర్నర్​సంతృప్తి చెంది సంతకం చేస్తే తప్ప బిల్లు చట్టరూపం దాల్చదు.

అప్పటివరకు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల లొల్లి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్​బిల్లులు ఆమోదించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు సైతం వెళ్లడం వెనక ప్రధాన కారణం ఈ బిల్లేనని ప్రగతి భవన్​వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ బిల్లును గవర్నర్​తిప్పిపంపడంతో వ్యవహారం మొత్తం మళ్లా మొదటికి వచ్చిందని, మున్సిపాలిటీల్లో ఈ జాప్యం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని గులాబీ పార్టీ పెద్దలు బుగులు పడుతున్నారు. 

బిల్లు ఆమోదం పొందితేనే.. 

రాష్ట్ర అసెంబ్లీకి ఆరు నెలల్లోపే ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్టోబర్​లోనే ఎన్నికలు రావొచ్చని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఈ లెక్కన నాలుగు నెలల్లోనే అసెంబ్లీ పోరు ఉంటుంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో అవిశ్వాసాల పంచాయితీ తమకు ఎక్కడ చేటు తెస్తుందోనని అధికార పార్టీ ఆందోళన చెందుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్తేనన్నా గవర్నర్ దిగివచ్చి ఈ ఫైల్​క్లియర్​చేస్తారనుకుంటే వెనక్కి పంపి ఇంకా సంక్లిష్టం చేశారని..దీంతో మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల పంచాయితీకి ఎలా ఎండ్​కార్డ్​వేయాల్నో అంటూ టెన్షన్ పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 23 మున్సిపాలిటీల్లో అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. 


ఇంకో12 చోట్ల నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినా సాంకేతిక కారణాలతో సాధ్యం కాలేదు. కానీ ఆయా మున్సిపాలిటీల్లో నేతల మధ్య కుమ్ములాటలు మాత్రం సద్దుమణగడం లేదు. బిల్లుకు గవర్నర్​ఆమోదముద్ర వేస్తే తప్ప ఈ వ్యవహారం కొలిక్కిరాదని, అప్పటివరకు మున్సిపాలిటీల్లో లీడర్ల మధ్య సయోధ్య కుదర్చడం కత్తిమీద సాములా మారిందని గులాబీ నేతలు వాపోతున్నారు. 

అవిశ్వాసం నోటీసులిచ్చిన మున్సిపాలిటీలివే.. 

మెదక్ జిల్లాలోని నర్సాపూర్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి,  సదాశివపేట, ఆందోల్, -జోగిపేట, భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్, ఖమ్మం జిల్లాలోని వైరా, సిద్దిపేట జిల్లా గజ్వేల్, నల్గొండ జిల్లాలోని నల్గొండ, హాలియా, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జనగామ జిల్లాలోని జనగామ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, మేడ్చల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో, బండ్లగూడ జాగీర్, జవహర్​నగర్​కార్పొరేషన్లలో అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో అవిశ్వాసం నోటీసును కలెక్టర్​ తీసుకోకపోవడంతో కౌన్సిలర్లు హైకోర్టుకు వెళ్లారు.

కొత్తగూడెం మున్సిపాలిటీలో అవిశ్వాసానికి మెజారిటీ కౌన్సిలర్లు ప్లాన్ చేసినా నోటీసు ఇవ్వలేదు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్​లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నించినా నోటీసులు ఇవ్వలేదు. జగిత్యాల మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నం చేయడంతో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి పదవికి రాజీనామా చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నించి విరమించుకున్నారు. మరికొన్ని చోట్ల కూడా కౌన్సిలర్లు, చైర్మన్ ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.